పోచమ్మమైదాన్/కరీమాబాద్/గిర్మాజీపేట/నల్లబెల్లి/రాయపర్తి, సెప్టెంబర్ 28: దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గామాత బుధవారం వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు విశేష పూజలు అందించారు. వరంగల్‌లోని శ్రీశృంగేరి శంకరమఠంలో శారదామాతకు ప్రధాన అర్చకుడు సంగమేశ్వర జోషి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ములుగురోడ్డులోని వాసవీమాత ఆలయంలో అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేసి, కుంకుమార్చన చేశారు. అలాగే, అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. కార్తీకేయశర్మ ఆధ్వర్యంలో శ్రీఅన్నపూర్ణ మూల మంత్రహోమం నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా వరంగల్ కొత్తవాడలో మాతా గురుస్వామి భాషకార్ల హరికృష్ణ పటేల్‌తోపాటు సభ్యులు తులా గణేశ్, వెల్దండి రాజు ఆధ్వర్యంలో అమ్మవారికి హంస వాహన పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక భక్తులు అమ్మవారికి ఎదురుగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ దంపతులు తదితరులు పాల్గొన్నారు. అండర్‌రైల్వేగేట్ ప్రాంతం 32వ డివిజన్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని నాగదేవతా సహిత కనకదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు. వరంగల్‌లోని రామన్నపేటలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, శ్రీరామలింగేశ్వరస్వామి, స్టేషన్‌రోడ్డులోని శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయంలో హోమాలు, అభిషేకం చేశారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిత్యం చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు బ్రహ్మదేవర ఆనందరావు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు గాయత్రీదేవి అవతారంలో దర్శనమిచారు. అనంతరం అన్నదానం చేశారు. నల్లబెల్లి మండలం నారక్కపేటలో మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చారు. రాయపర్తిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కనకదుర్గమ్మ భక్తులకు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు.