వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 28 : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక వసతులు, ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చుతున్నది. వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్‌గా మార్చేందుకు అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె శస్త్రచికిత్సలను ప్రారంభించింది. బుధవారం కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.
గుండెకు రంధ్రం పడి ఇబ్బందులు పడుతున్న మహిళకు కార్డియోథెరపిక్ సర్జరీని చేశారు. వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని ప్రాంతానికి చెందిన వడ్డెపల్లి స్వప్న (31) సంవత్సరం క్రితం గుండెకు రంధ్రం ఏర్పడింది. కాగా, అక్కడి ప్రభుత్వ వైద్యుల సూచన మేరకు సెప్టెంబర్ 8న ఎంజీఎం వైద్యాధికారులను సంప్రదించింది. దీంతో కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 20 రోజుల అనంతరం రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి బుధవారం సుమారు రెండున్నర గంటల పాటు వైద్యులు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు.
నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్‌రావు పర్యవేక్షణలో జరిగిన శస్త్ర చికిత్సలో కార్డియో థెరపిక్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్లాడి సృజన్, డాక్టర్ రితీశ్, పర్ఫ్యూషనిస్ట్ శ్రీనివాస్, అనస్థీషియన్ ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జునరెడ్డి, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శ్రవణ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్పూర్తి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్, ఎంజీఎం ఆర్ఎంవో డాక్టర్ మురళి, నర్సింగ్ సూపరింటెండెంట్ సుశీల బృందం, పలువురు టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా, గుండెకు సంబంధించిన మొదటి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందానికి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.