నమస్తే నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయాన్నే తలంటు స్నానాలు ఆచరించి పూలను సేకరించిన మహిళలు.. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం సంప్రదాయ దుస్తుల్లో గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, చెరువుల ప్రాంతాలు, ఆట స్థలాలకు బతుకమ్మలతో ర్యాలీగా చేరుకున్న ఆడబిడ్డలు.. ఒకచోట చేరి కోలాటాలు, బతుకమ్మ పాటలతో అలరించారు. రాత్రి వరకు ఆటలు ఆడి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకొని తిరిగి ఇండ్లకు చేరుకున్నారు. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని మున్సిపల్, గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఘనంగా ఏర్పాట్లు చేశాయి.
నర్సంపేటలోని వేంకటేశ్వరాలయం, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, పద్మశాలి ఫంక్షన్ హాల్, పోచమ్మ ఆలయానికి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ ఆడారు. జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడి సందడి చేశారు. వర్ధన్నపేటలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, కౌన్సిలర్ రాజమణి, టీఆర్ఎస్ మహిళా నేతలు రామ్‌లీలా మైదానంలో బతుకమ్మ ఆడారు. గీసుగొండ మండలంలోని 21 గ్రామాలతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఎంపీపీ భీమగాని సౌజన్య పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. నల్లబెల్లి మండలంలో మొదటి రోజు బతుకమ్మ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సంగెం మండలంలో మహాలయ అమవాస్య రోజున బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాయపర్తి మండలంలో బతుకమ్మ పాటలు, సామూహిక నృత్యాలతో మహిళలు హోరెత్తించారు. నెక్కొండలో మహిళలతో కలిసి సర్పంచ్ సొంటిరెడ్డి యమున బతుకమ్మ ఆడారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ వేడుకల కోసం ఖానాపురం మండలంలో ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. నర్సంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకులు వైభవంగా జరిగాయి. చెన్నారావుపేటలో సంబురాలు అంబరాన్నంటాయి. పర్వతగిరి మండలంలో మహిళలు బతుకమ్మలతో సందడి చేశారు.
వరంగల్ రామన్నపేటలోని రామలింగేశ్వర ఆలయం ప్రాంగణంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొని మహిళలతో కలిసి ఆడి పాడారు. ఈ సందర్భంగా మేయర్ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, వరంగల్ స్టేషన్‌రోడ్డులోని శ్రీకాశీవిశ్వేశ్వరాలయం ప్రాంగణంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆటలు ఆడారు. అలాగే, కాశీబుగ్గలోని శ్రీకాశీవిశ్వేశ్వర రంగనాయక ఆలయం మహిళలతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.
19వ డివిజన్లోని వెంకట్రామ టాకీస్ ఏరియా శ్రీకనకదుర్గ ఆలయంలో మహిళలు బతుకమ్మ పాటలతో సందడి చేశారు. అలాగే, ఓసిటీ క్లబ్ హౌస్, కాశీబుగ్గ సొసైటీకాలనీ, ఎనుమాముల, ఎన్టీఆర్నగర్, సుందరయ్యనగర్, బాలాజీనగర్, ఎస్ఆర్నగర్, కొత్తపేట, ఆరెపల్లి, పైడిపల్లిలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఖిలావరంగల్‌లోని స్వయంభూ శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయం, తూర్పుకోట, పడమరకోట మెట్టు దర్వాజ వద్ద, శివనగర్ రామాలయం, ఆదర్శనగర్, స్తంభంపల్లి, వసంతపురం, గాడిపల్లి, దూపకుంట, బొల్లికుంట, రామకృష్ణపురంలో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సంబురపడ్డారు.
అలాగే, పెద్దల అమావాస్యను పురస్కరించుకొని తమ పూర్వీకుల పేర్లపై అలయాల్లోని అర్చకులకు సాహిత్యాన్ని అందజేశారు. కరీమాబాద్ అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని ఇంటింటా ఆడబిడ్డలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ, 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. అలాగే, 32, 39, 40, 41, 42, 43 డివిజన్లలో వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ 27వ డివిజన్ పరిధిలోని గోవిందరాజులగుట్ట, 36వ డివిజన్ పరిధిలోని మహంకాళి ఆలయాల వద్ద మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. వరంగల్ కొత్తవాడలోని తోట మైదానంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. అలాగే, దేశాయిపేట, తుమ్మలకుంట, ఆటోనగర్, కల్యాణ్‌నగర్, గణేశ్‌నగర్, శ్రీనివాసకాలనీలో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.