వరంగల్, సెప్టెంబర్ 23 : చారిత్రక ఓరుగల్లును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. భద్రకాళి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ప్రధాన అర్చకుడు శేషు, ఈవో శేషుభారతితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి అక్టోబర్ 6 వరకు భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కార్పొరేషన్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వసతులు కల్పిస్తున్నామని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఆలయం చుట్టూ త్వరలోనే మాడ వీధుల నిర్మాణం చేపడుతామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మాడవీధుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని, త్వరలోనే నిధులు మంజూరు చేస్తారని చెప్పారు. ఆలయ ప్రధాన అర్చకుడు శేషు మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. విజయదశమి రోజు తెప్పోత్సవం, భద్రకాళి చెరువులో హంస వాహనంపై అమ్మవారిని ఊరేగిస్తామని వివరించారు.
సీఎం కేసీఆర్ 11.5 కిలోల బంగారంతో చేయించిన నగలను ఉత్సవాల సందర్భంగా భద్రకాళి అమ్మవారికి అలంకరిస్తామని ఈవో శేషుభారతి తెలిపారు. నవరాత్రి ఉత్సవాల ప్రారంభ రోజు ఉదయం 10 గంటలకు ఆర్చీ నుంచి బంగారు ఆభరణాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నవరాత్రుల సందర్భంగా అల్పాహారంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కుడామాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవరకొండ సురేందర్, మాలకుమ్మరి పరశురాములు, తాడిశెట్టి విద్యాసాగర్, ఆలయ సూపరింటెండెంట్లు అద్దంకి విజయ్‌కుమార్, హరినాథ్, అర్చకులు నాగరాజు శర్మ, రాముశర్మ, దత్తుశర్మ, ప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ కానుకగా చీరలు అందజేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు. కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి అధ్యక్షతన కీరి ్తగార్డెన్లో 11, 29 డివిజన్ల మహిళలకు బతుకమ్మ చీరలను మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యతో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేత పిలుపు ఇస్తే మహిళలు బతుకమ్మలు, బోనాలతో ముందుండేవారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుపోతున్నారని వివరించారు. బతుకమ్మ కానుకలను స్వీకరించి సీఎం కేసీఆర్‌ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా బతుకమ్మ చీరలను కాల్చడం బాధాకరమన్నారు. సమైక్య రాష్ట్రంలో చేతినిండా పనిలేక నేతన్నలు ఆకలి చావుకు గురైతే సీఎం కేసీఆర్ వారికి ఉపాధి కల్పించడానికి రూ.339 కోట్లు వెచ్చించి బతుకమ్మ చీరలను తయారు చేయించారని చెప్పారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 10 రకాల రంగులతో 240 డిజైన్లతో బతుకమ్మ చీరలను ఆకర్షణీయంగా తయారు చేయించారని అన్నారు. గ్రేటర్ పరిధిలో 2 లక్షల 16 వేల 16 చీరలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ బతుకమ్మ చీరలను గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేస్తామని వివరించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, డిప్యూటీ కమిషనర్ జోనా, రెవెన్యూ అధికారి శ్రీనివాస్, టీఎంసీ రమేశ్, టీఆర్ఎస్ నాయకులు దేవరకొండ సురేందర్, మాలకుమ్మరి పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట : రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మహిళలు ఆశీర్వదించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో 47,62, 63 డివిజన్లకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మున్సిపల్ డిఫ్యూటీ కమిషనర్ జోనా, కార్పొరేటర్ సంకు నర్సింగ్, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు సుంచు కృష్ణ , నార్లగిరి రమేశ్, నయీం జుబేర్, కోల వినోద, మర్యాల కృష్ణ, మాజీ కార్పొరేటర్ సుంచు అశోక్, మైసారపు సిరిల్ లారెన్స్, బెదరకోట రంజిత్‌కుమార్, మైలారం శంకర్, వినయ్, వెనిశెట్టి రఘు, భిక్షపతి, వెంకన్న, బండి రాంచందర్, శేఖర్, అఫ్జల్, బొట్టు రాజు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : చారిత్రక రుద్రేశ్వర వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహించనున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆదేశించారు. వేయిస్తంభాల కుడా గార్డెన్లో శుక్రవారం ఉత్సవాల ప్రచార కరపత్రాలను చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఉత్సవాల దాతలు, ఈవో వెంకటయ్య, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మతో కలిసి ఆవిష్కరించారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఉత్సవ దాతలు ఎంఎస్కే బాబ్జి, కోణ శ్రీకర్, పల్లం రమేశ్, పులి రజినీకాంత్, రావుల సుదర్శన్, గుడా భరత్‌కుమార్, తాడిశెట్టి విద్యాసాగర్, కానుగంటి శేఖర్, బింగి శ్రీనివాస్ పాల్గొన్నారు. నగరంలో ఉన్న క్లాత్ మర్చంట్స్ సహకారంతో 25న సాయంత్రం 5 గంటలకు రాధేశ్యాం సాహితీ సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ పాటల పోటీలు నిర్వహిస్తామని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులుగంగు మణికంఠశర్మ, ప్రణవ్ పాల్గొన్నారు.
హనుమకొండ : ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పలు సమస్యలతో భారీగా వచ్చిన ప్రజల నుంచి చీఫ్ విప్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లో తెలిపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మరికొన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.