సంగెం, సెప్టెంబర్ 23: గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి రూ. 40 వేలు లంచం తీసుకుంటూ వరంగల్ జిల్లా సంగెం మండల తహసీల్దార్ నర్మెట్టి రాజేంద్రనాథ్ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. పర్వతగిరి మండలం చింతనెక్కొండకు చెందిన నల్లపు కుమార్‌కు సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ శివారులోని కాపులకనపర్తి రెవెన్యూ పరిధిలో 274/2లోని 1.38 ఎకరాలు, 274/బిలో 1.30 ఎకరాల భూమి ఉంది. ఇందులోని ఎకరం భూమిని తన సోదరి మహబూబాబాద్‌కు చెందిన ఆకుల అనిత పేరుపై గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలని నాలుగు నెలలుగా తిరుగుతున్నాడు. మూడుసార్లు స్లాట్ బుక్ చేసినప్పటికీ తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయకుండా అతడిని తిప్పించుకుంటునాడు. మార్చిలో ఒకసారి, ఈ నెల 15న , 23న స్లాట్ బుక్ చేసుకున్నాడు.
అయితే, తహసీల్దార్ రాజేంద్రనాద్ రిజిస్ట్రేషన్‌కు రూ. లక్ష డిమాండ్ చేశాడు. చివరకు రూ. 40 వేలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు బాధితుడిని శుక్రవారం హనుమకొండలోని నందినిహిల్స్లో ఉన్న తన నివాసానికి డబ్బులతో రావాలని తహసీల్దార్ సూచించాడు. ఈ క్రమంలో నల్లపు కుమార్ డబ్బులు తీసుకొని వెళ్లి తహసీల్దార్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా ఏసీబీ అధికారులు హనుమకొండ నుంచి సంగెం తహసీల్ కార్యాలయానికి రాజేంద్రనాథ్‌ను తీసుకొచ్చి 5 గంటలపాటు విచారించారు. వరంగల్ ఆర్డీవో మహేందర్‌జీని మండలకేంద్రానికి ఏసీబీ అధికారులు రప్పించారు. రాజేంద్రనాద్ చేసిన స్లాట్లు, రిజిస్ట్రేషన్ల వివరాలను పరిశీలించారు. అనంతరం అన్ని రికార్డులను సీజ్ చేశారు.
భూమిని గిఫ్ట్ డీడీ చేయాలని నాలుగు నెలలుగా తిరుగుతున్నా తహసీల్దార్ రాజేంద్రనాథ్ లంచం డిమాండ్ చేస్తున్నాడని నల్లపు కుమార్ ఈ నెల 1న ఫిర్యాదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ హరీశ్‌కుమార్ తెలిపారు. మూడుసార్లు స్లాట్ బుక్ చేసినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలిపారు. ఈ క్రమంలో తహసీల్దార్ రాజేంద్రనాథ్‌కు కుమార్ రూ. 40 వేల లంచం ఇస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు.
తన కుమార్తె పేరున గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలని నాలుగు నెలలుగా తన కుమారుడు కుమార్ తిరుగుతున్నా తహసీల్దార్ రాజేంద్రనాథ్ కనికరించలేదని బాధితుడి తండ్రి నల్లపు వీరయ్య తెలిపారు. లక్ష రూపాయలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని కరాఖండిగా చెప్పడంతో తన కుమారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు.
రిజిస్ట్రేషన్‌లో ఏచిన్న పొరపాటు ఉన్నా ఆ రోజు తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ఆపేవాడని మండలంలోని పలువురు రైతులు ఆరోపించారు. మరుసటి రోజు ఆ రైతుకే ఫోన్ చేసి డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించేవాడని పేర్కొన్నారు. తహసీల్దార్‌కు బయపడి మీసేవ కేంద్రాల నిర్వాహకులు కూడా స్లాట్ బుక్ చేసే వారు కాదని చెబుతున్నారు. పైసలు ఇవ్వనిదే తహసీల్దార్ ఏ రిజిస్ట్రేషన్ చేసేవాడు కాదని ఆరోపిస్తున్నారు. ఓ గ్రామంలో 14 గుంటల భూమి రిజిస్ట్రేషన్‌కు రూ. 15 వేలు లంచం తీసుకున్నాడని ఒకరు, మరో రైతు భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడని వాపోతున్నారు. కాగా, సంగెం తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడడంతో మండల ప్రజలు వాట్సాప్ గ్రూపుల్లో సంబురపడుతూ పోస్టులు పెట్టడం కొసమెరుపు.