సుబేదారి, సెప్టెంబర్ 23: కేంద్రం ప్రభుత్వ పథకాల పరిధిలో పనిచేస్తున్న ఆశ కార్యకర్తల గోడును సాక్షాత్తూ కేంద్రమంత్రే పట్టించుకోలేదు. పట్టణ ఆరోగ్య కేంద్రం సందర్శనకు వచ్చిన సందర్భంగా కేంద్ర మంత్రిని వేతనాలు పెంచాలని కోరిన సీవో, ఆశ కార్యకర్తలకు ఎలాంటి జవాబు ఇవ్వకుండానే ముఖం చాటేసి అక్కడి నుంచి జారుకున్నారు. ఆరోగ్య కేంద్రం బలోపేతం కోసం కేంద్రం తరఫున మంత్రి ఏదైనా ప్రకటిస్తారేమోనని ఆశించిన సిబ్బందికీ నిరాశే ఎదురైంది. లోక్సభ ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్ర సహకార, ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి సహాయ మంత్రి బీఎల్ వర్మ వరంగల్ లోక్సభ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం సందర్శనకు వచ్చారు. ఆయనను సాదరంగా స్వాగతించిన సిబ్బంది అనంతరం తమ విషయాలను వివరించారు.
‘మేము కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలో పని చేస్తున్నాం. మా వేతనం రూ.13వేలు ఉన్నది. ఏఎన్ఎంలకు, ఆశాలకు సూపర్వైజర్గా అన్ని పనులూ చేస్తున్నాం. మా వేతనం ఎటూ సరిపోతలేదు. మా వేతనాన్ని పెంచండి.. వీలైతే రూ.30 వేలు చేయండి.. అలాగే ఆశ కార్యకర్తలకు రూ.9,750 వేతనం ఉంది. వీరికి కూడా వేతనాలు పెంచాలి’ అని కమ్యూనిటీ ఆర్గనైజర్ టీ మంగ కేంద్రమంత్రిని కోరింది. పక్కనే ఉన్న ఆశ కార్యకర్త లత ‘మాకు వేతనాలు పెంచాలి సార్.
రాష్ట్ర ప్రభుత్వం రూ.9,750 ఇస్తున్నది. రాష్ట్ర సర్కారులాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి సర్’ అని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసింది. కమ్యూనిటీ సూపర్వైజర్ టీ మంగ, ఆశ కార్యకర్త లత చెప్పిన విషయాలను పక్కనే ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి హిందీలో కేంద్ర మంత్రి వర్మకు వివరించారు. మొత్తం విన్న కేంద్ర మంత్రి వర్మ తనకు ఏమీ తెలియనట్లుగా ముఖం పెట్టారు. ఇద్దరు సిబ్బంది మరోసారి చెప్పినా ఎలాంటి హామీ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేంద్రమంత్రి తమ ఆవేదనను పట్టించుకోలేదని అక్కడున్న సిబ్బంది వాపోయారు.
కేంద్ర మంత్రి బీఎల్ వర్మ అధికారిక పర్యటన పూర్తిగా బీజేపీ కార్యక్రమంలో సాగింది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించే సమయంలో మంత్రి వెంట మొత్తం బీజేపీ నేతలు, కార్యకర్తలే ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగానే వైద్య సిబ్బందిని వెనక్కి నెట్టి మరీ బీజేపీ నేతలు పార్టీ కండువాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి ఆరోగ్య కేంద్రం లోపలికి వెళ్లారు. బూస్టర్ డోస్ వేసుకునే వ్యక్తి పక్కన ఉండి ఫొటో దిగారు. కేంద్రమంత్రితోపాటు పలువురు బీజేపీ నాయకులు పార్టీ కండువాలు వేసుకుని అందరూ ఆరోగ్య కేంద్రం లోపలికి వచ్చారు. దీంతో వైద్య సేవల కోసం అక్కడికి వచ్చిన వారు, వైద్య సిబ్బంది ఇబ్బంది పడ్డారు. మీడియాలో హడావుడి కోసం ఆరోగ్య కేంద్రం పర్యటన పెట్టుకున్నారని అక్కడికి వచ్చినవారు వ్యాఖ్యానించారు. ఆరోగ్య కేంద్రం బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఏదైనా ప్రకటిస్తారేమోనని ఆశించామని, ఫొటోలు దిగి వెళ్లిపోయారని సిబ్బంది పెదవివిరిచారు.