ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం ప్రభుత్వం జీవో 59 జారీ చేయగా, అధికారులు బుధవారం నుంచి ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మొత్తం 693 దరఖాస్తులు రాగా, నిబంధనల మేరకు 557 ఇళ్లు వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కలెక్టర్ బీ గోపి ఇళ్ల పరిశీలనకు తొమ్మిది అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పన్నెండు మండలాల్లో ప్రక్రియ కొనసాగుతుండగా, వారం రోజుల్లో వివరాల సేకరణ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు.
వరంగల్, సెప్టెంబర్ 23(నమస్తేతెలంగాణ) : ఎనిమిదేళ్ల క్రితం అనుమతుల్లేకుండా ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన ఇళ్ల క్రమబద్ధీకరణకు సర్కారు కసరత్తు చేపట్టింది. జీవో 59 అనుసరించి అందిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు జిల్లాలో వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లను పరిశీలిస్తున్నారు. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. పరిశీలన పూర్తి కాగానే ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. 2014 జూన్ 2లోపు ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా 125 గజాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించుకున్న ఇళ్లను జీవో 59 ద్వారా రెగ్యులరైజ్ చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇటీవల దరఖాస్తులను స్వీకరించింది.
జిల్లాలో పన్నెండు మండలాల నుంచి 693 మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. అధికారులు ఈ దరఖాస్తులను పరిశీలించారు. వీటిలో 136 దరఖాస్తులకు సంబంధించిన స్థలాలు అత్యంత విలువైనవిగా గుర్తించారు. వీటిల్లో అత్యధికంగా నర్సంపేట మండలానికి చెందినవి 62, వరంగల్ మండలానివి 46, ఖిలావరంగల్ మండలానివి 28 ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి మిగతా 557 ఇళ్ల వెరిఫికేషన్ చేసి నివేదిక పంపాలని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ దరఖాస్తుల్లో నర్సంపేట మండలానికి చెందినవి 335 ఉన్నాయి.
104 దరఖాస్తులతో వరంగల్ మండలం రెండో స్థానంలో ఉంది. ఖిలావరంగల్‌లో 26, గీసుగొండలో 42, పర్వతగిరిలో 8, నెక్కొండలో 12, రాయపర్తిలో 8, సంగెంలో 7, వర్ధన్నపేటలో 6, దుగ్గొండిలో 4, చెన్నారావుపేటలో 3, ఖానాపురం నుంచి 2 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దరఖాస్తులకు సంబంధించి వెరిఫికేషన్ కోసం కలెక్టర్ బీ గోపి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై జీవో 59 నిబంధనలపై చర్చించారు. వెరిఫికేషన్‌లో సేకరించాల్సిన వివరాలను తెలియజేశారు.
జీవో 59 దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు కలెక్టర్ గోపి జిల్లాలో తొమ్మిది వెరిఫికేషన్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందానికి ఒక జిల్లా స్థాయి అధికారిని హెడ్‌గా నియమించారు. నాయబ్ తాసిల్దార్లు, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు సభ్యులుగా ఉన్నారు. తొమ్మిది బృందాలు బుధవారం నుంచి జిల్లాలో తమకు కేటాయించిన ప్రాంతంలో క్షేత్రస్థాయి వెరిఫికేషన్ నిర్వహిస్తున్నాయి. నర్సంపేట మండలంలో మూడు బృందాలు ఈ పనిలో ఉన్నాయి. వీటిలో ఒక బృందానికి పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహమూర్తి, మరో బృందానికి మత్స్యశాఖ జిల్లా అధికారి నరేశ్‌కుమార్ నాయుడు, ఇంకో బృందానికి పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ బాలకృష్ణ నేతృత్వం వహిస్తున్నారు.
ఖిలావరంగల్‌లో జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, వరంగల్‌లో జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్, గీసుగొండలో ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా అధికారి జహీరొద్దీన్, పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెంలో డీఆర్డీవో సంపత్‌రావు, నెక్కొండలో జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, దుగ్గొండి, ఖానాపురంలో సీపీవో జీవరత్నం బృందాలు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నాయి. కలెక్టర్ ఈ బృందాలతో గత సోమవారం సమావేశం నిర్వహించి వారం రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పారు. దీంతో వెరిఫికేషన్ బృందాలు దరఖాస్తుల ఆధారంగా ఇళ్ల వివరాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేకరిస్తున్నారు.
అనుమతుల్లేకుండా వెలిసిన ఇళ్లను క్రమబద్ధీకరించడానికి ప్రభు త్వం నిబంధనలు విడుదల చేసింది. 2014 జూన్ 2లోపు ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల్లేకుండా నిర్మించుకున్న ఇళ్ల దరఖాస్తులను మాత్ర మే క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం పరిశీలిస్తున్నది. 125 నుంచి 150 గజాల్లోపు విస్తీర్ణంలో ఉన్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించనుంది. నోటిఫైడ్ స్లమ్స్లోపలి ఇళ్లను మార్కెట్ విలువలో పది శాతం ఫీజుతో రెగ్యులరైజ్ చేయనుంది. 250 గజాల్లోపు స్థలంలో ఉన్న ఇళ్లకు మార్కెట్ విలువలో 25 శాతం, 500 గజాల్లోపు స్థలంలో ఉన్న ఇళ్లను యాభై శాతం, 500కుపైగా గజాల స్థలంలో ఉన్న ఇళ్లను 75 శాతం ఫీజుతో క్రమబద్ధీకరించనుంది. 1000 గజాలకుపైగా స్థలంలో ఉన్న ఇళ్ల ప్రతిపాదనలను సీసీఎల్ఏకు పంపాల్సి ఉంది. 2014 జూన్ 2న ఉన్న మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఫీజు తీసుకోనుంది. ప్రస్తుతం ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్న అధికారులు నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి రికమెండ్ చేస్తారు. ఆయా దరఖాస్తుకు సంబంధించిన ఇల్లు ఎన్ని గజాల స్థలంలో ఉందనేది స్పష్టంగా నివేదికలో పేర్కొంటారు. ఆన్లైన్లోనే అప్లోడ్ చేస్తారు. వీటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారులు ఫీజు చెల్లించిన దరఖాస్తుదారుల ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తారు.