నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 20: ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ మోతె కళావతి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. మండలంలోని 27 గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు, కాల్వలు ఆక్రమణకు గురికాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండలవ్యాప్తంగా పేరుకుపోయిన సమస్యలపై ఎంపీటీసీలు అధికారులను ప్రశ్నించారు. ముఖ్యంగా రాజుపేటలో చెరువు శిఖం ఆక్రమణపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాలు మండల సభలో చర్చకొచ్చాయి. తొలుత శాఖల వారీగా అధికారులు నివేదికలు చదివి వినిపించారు.
మండలంలోని ముత్తోజిపేట, రాజుపేట గ్రామ శివారు నర్సంపేట-నల్లబెల్లి ఎన్‌హెచ్-365 జాతీయ ప్రధాన రహదారి పక్కన పెరుమాండ్లకుంట(పీతిరికుంట) 34 ఎకరాల్లో సర్వే నంబర్ 8లో 25.10 ఎకరాలు, సర్వే నంబర్ 184లో 9.04 ఎకరాల చెరువు శిఖంతోపాటు ప్రభుత్వ భూమి పూర్వం నుంచి ఉందని నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ స్థలాన్ని ఇటీవల కొంతమంది ఆక్రమించేందుకు యత్నించగా ‘నమస్తేతెలంగాణ’ వెలుగులోకి తెచ్చిందన్నారు. రియల్టర్లపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపించారు. ముత్తోజిపేట, రాజుపేట, కమలాపురంలోని చెరువులు, కుంటలను వెంటనే సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు.
సర్కారు భూముల కొనుగోలు చెల్లదు..
రాజుపేట ఏజెన్సీ గ్రామంలోని సర్వే నంబర్ 8, 184లో మొత్తం ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటి కొనుగోళ్లు, అమ్మకాలు చెల్లవని తాసిల్దార్ వాసం రామ్మూర్తి స్పష్టం చేశారు. మండలవ్యాప్తంగా చెరువులు, కుంటలను సర్వేయర్‌తో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. లక్నేపల్లిలో నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారి పక్కన ఉన్న రెండు గుంటల భూమి జీపీదేనని సర్పంచ్ గొడిశాల రాంబాబు, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత అన్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. దివ్యాంగులు రేషన్ దుకాణాలకు రాలేకపోతున్నారని, వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని పీఏసీఎస్ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఇటుకాలపల్లి ఎంపీటీసీ భూక్యా వీరన్న, రామవరం సర్పంచ్ కొడారి రవన్న కోరారు.
రేషన్‌కార్డులో పేరు లేని వారికి బతుకమ్మ చీరెలు రావడం లేదని లక్నేపల్లి ఎంపీటీసీ రజిత అన్నారు. అర్హులకు చీరెలు అందేలా చూడాలని కోరారు. రైతు ఖాతాల్లో పడిన రైతుబంధు డబ్బులను బ్యాంకర్లు గత అప్పు కింద చూసుకుంటున్నారని ఎంపీటీసీలు వీరన్న, సాంబరెడ్డి, విజయ, రజిత సభ దృష్టికి తీసుకొచ్చారు. ముత్తోజిపేట, లక్నేపల్లి, పర్శనాయక్‌తండా, ఇటుకాలపల్లిలో మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, వెంటనే కాంట్రాక్టర్‌తో పనులు పూర్తి చేయించాలని ఎంపీటీసీలు గంగాడి సాంబరెడ్డి, ఉల్లేరావు రజిత, భూక్యా వీరన్న, సర్పంచ్‌లు గోలి శ్రీనివాస్‌రెడ్డి, గొడిశాల రాంబాబు, మండల రవీందర్, బానోత్ గాంధీ కోరారు. కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తానని ఏఈ హామీ ఇచ్చారు. సభలో ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్, సీనియర్ అసిస్టెంట్ సంతోష్‌బాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.