కొడకండ్ల, సెప్టెంబర్ 20: తమ కొడుకు క్షేమంగా ఇంటికి వస్తాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ నెల 18న మండల కేంద్రంలో కనిపించకుండా పోయిన బాలుడు మంగళవారం వ్యవసాయబావిలో శవమై తేలాడు. రెండు రోజుల పాటు కొనసాగిన పోలీసుల గాలింపు విషాదంతో ముగిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగరి మండలం తాచ్పూర్కు చెందిన జమీల్-జరీనా దంపతులు ఏడాది నుంచి బతుకుదెరువు కోసం జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రంలో ఉంటున్నారు. జమీల్ సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో కర్రకోత మిషన్‌లో పని చేస్తున్నాడు.
ఆదివారం ఉదయం జమీల్ పని కోసం తిరుమలగిరికి వెళ్లాడు. తమ పెద్దకొడుకు సాబీర్ గుడిసె ముందు ఆడుకుంటుండగా, జరీనా పనిలో నిమగ్నమైంది. కొద్దిసేపటి తర్వాత సాబీర్ కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పాలకుర్తి సీఐ చేరాలు ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి మండలకేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో విచారించారు. సోమవారం సమీపంలోని సీసీ కెమెరాలను మరోసారి పరిశీలించడంతోపాటు కుటుంబ సభ్యుల బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
జమీల్-జరీనా దంపతుల బంధువైన మహ్మద్ గుంషా అలియాస్ మహబూబ్ బాలుడిని తీసుకొని వెళ్లి ఆ తర్వాత కొది సేపటికి గుడిసెల వద్దకు ఒక్కడే వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. విషయం పోలీసులకు తెలిసిందన్న భయంతో నిందితుడు పరారయ్యాడు. పోలీసులు అతడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. మంగళవారం తిరుమలగిరిలో ఉన్నాడని సమాచారం తెలిసి వెంటనే అక్కడికి చేరుకొని సినీ ఫక్కీలో అతడిని పట్టుకొని పాలకుర్తి స్టేషన్‌కు తరలించారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కొడకండ్ల శివారులోని వ్యవసాయ బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. కాగా, బాలుడి హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్ పరిశీలించారు.