‘గత ప్రభుత్వాల హయాంలో పట్టణాల్లోని క్రీడామైదానల్లోనూ సరైన సౌకర్యాలు ఉండకపోయేవి. ఇక మారుమూల ప్రాంతాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. సరైన ప్రోత్సాహం లేక జాతీయ, అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులు వెళ్లలేకపోయేవారు. పాఠశాలల్లో విద్యార్థులకు వసతులే లేకపోయేటివి. ఇప్పుడా పరిస్థితి లేదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు.. ఆటల్లో నైపుణ్యం పొందేందుకు కావాల్సిన వసతులు కల్పిస్తున్నారు.. మారుమూల ప్రాంతాల్లోనూ మైదానాలను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రతి పాఠశాలకు పీఈటీని నియమించారు’ అని క్రీడాకారులు చెబుతున్నారు. గతం కంటే ఇప్పుడు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్ బాల్ ఆడేవారు పెరిగారని, కేసీఆర్ లాంటి వ్యక్తి దేశ పాలనా పగ్గాలు చేపడితే క్రీడారంగం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల క్రీడాకారులు సైతం వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెబుతున్నారు.
క్రీడారంగం బాగుండాలంటే కేసీఆర్ రావాలి..
గోవిందరావుపేట, సెప్టెంబర్ 20 : క్రీడారంగం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్లడం తప్పనిసరి. క్రీడారంగంలో ఇతర రాష్ట్రంతో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు స్పోర్ట్స్ అథారిటీ, హాస్టల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలు చాలా పెరుగుతాయి. క్రీడాకారులకు ఎంతో మేలు చేసిన వ్యక్తిగా కేసీఆర్ నిలిచిపోతారు. క్రీడాకారులు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేసీఆర్ దేశ రాజకీయాల వైపు చూడడం శుభపరిణామం. రాష్ట్రంలో గ్రామస్థాయిలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలను ఏర్పాటుచేయడం గొప్ప విషయం. ప్రభుత్వం చేస్తున్న పనులు నాకు చాలా సంతోషం కలిగించాయి. దేశ రాజకీయాల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతీ గ్రామంలో ఉన్న క్రీడాకారుడు తన ప్రతిభను చాటేందుకు బాటలు వేసినట్లు అవుతుంది. క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని నేను నమ్ముతున్నా.
– కోసరి కృష్ణ ప్రసాద్, వాలీబాల్ ఇండియన్ టీం కోచ్, చల్వాయి
దేశమంతా 2శాతం స్పోర్ట్స్ కోటా..
కృష్ణకాలనీ, సెప్టెంబర్ 20 : అన్ని శాఖలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని క్రీడాకారులను కనీసం పట్టించుకున్న నాథుడు లేడు. క్రీడా మైదానాలూ ఉండకపోయేవి. మొక్కుబడిగా ఆడించేవారు. ఎంపిక శిబిరాలు చాలా తక్కువగా పెట్టేవారు. మన క్రీడాకారులు ఏ ఒక్కరు కూడా రాష్ట్ర, జాతీయస్థాయికి వెళ్లిన దాఖలాలు లేవు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో హనుమకొండ, మెదక్, కరీంనగర్ జిల్లాలకు సింథటిక్ ట్రాక్‌లు వచ్చాయి. అథ్లెటిక్స్ క్రీడాకారులను వేల సంఖ్యలో తయారు చేశారు. ప్రతి గ్రామంలో క్రీడా మైదానం, ప్రతి మండలం, జిల్లాకేంద్రాల్లో 3నుంచి 5 ఎకరాల్లో క్రీడా మైదానాలు వచ్చాయి. శిబిరాల్లో క్రీడాకారులను ఎంపిక చేసి గ్రామీణ స్థాయి క్రీడాకారులను రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయిలో ఆడిస్తున్నారు. అంతేగాక క్రీడాకారులకు రాష్ట్రంలోని అన్ని శాఖల్లో 2శాతం స్పోర్ట్స్ కోటా కల్పిస్తూ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇలా తెలంగాణ క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్టే.. రేపు దేశ రాజకీయాల్లో ఉంటే అన్ని రాష్ర్టాల ఆటగాళ్లకు మేలు జరుగుతుంది. ఫలితంగా మన దేశ క్రీడాకారులు కూడా అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తప్పకుండా రాణిస్తారు.
– సెగ్గం సిద్దు, గడ్డిగానిపల్లి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, జయశంకర్ భూపాలపల్లి
క్రీడలకు ప్రాధాన్యం పెరుగుతుంది..
మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 20 : రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. కేసీఆర్ పాలనలో తండాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సైతం మెరుగైన విద్య అందుతున్నది. గతంలో వాలీబాల్, కబడ్డీ ఆడేందుకు విద్యార్థులకు అరకొర సౌకర్యాలు ఉండేవి. కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యం కల్పించి ప్రతి జీపీకి క్రీడా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తున్నారు. ఇదంతా కేసీఆర్ ఆలోచన విధానం వల్లే సాధ్యమవుతున్నది. తెలంగాణ మాదిరిగా దేశంలో కూడా గొప్ప మార్పు రావాలంటే ఆయన జాతీయ రాజకీయాల్లో ఉండాలి. కేసీఆర్ వల్ల దేశంలో అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుంది. క్రీడలకు, క్రీడాకారులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.
– ధరావత్ మోహన్ నాయక్, కబడ్డీ క్రీడాకారుడు, జిల్లా గిరిజన స్పోర్ట్స్ అధికారి
గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మేలు..
నర్సింహులపేట, సెప్టెంబర్ 20 : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకం. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. అలాగే దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళితే గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇతర రాష్ర్టాల క్రీడాకారులకు ప్రోత్సాహకం అందించడంతో పాటు సైనిక, రైతుల కుటుంబాలకు అండగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడా కారులను పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లితే గ్రామీణ క్రీడాకారులకు మేలు జరుగుతుంది.
– ఓర్సు కొమురయ్య, జాతీయ క్రీడాకారుడు
స్పోర్ట్స్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది
జనగామ చౌరస్తా, సెప్టెంబర్ 20 : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే క్రీడారంగానికి మరింత గుర్తింపు వస్తుంది. కేసీఆర్ వచ్చిన తర్వాతే ఎంతో మంది జాతీయ క్రీడాకారులు ఒక్కరొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. క్రీడాకారులని ప్రోత్సహించడానికి ఇప్పటికే ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గ స్థాయిలో మినీ స్టేడియంలు ఏర్పాటుచేయడం మన కండ్ల ముందు కనిపిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇదివరకు 1శాతం రిజర్వేషన్ ఉన్న స్పోర్ట్స్ కోటాను కేసీఆర్ 2శాతానికి పెంచి క్రీడాకారుల మనసు గెలుచుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రాంతాలతో సంబంధం లేకుండా భారీగా ఆర్థిక సహకారం అందించి మరింత ప్రోత్సహించడం ఒక్క కేసీఆర్ దగ్గరే చూస్తున్నాం. ఇంతకంటే ఏం రుజువు కావాలి? కేసీఆర్ వంటి నాయకుడు క్రీడారంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు కల్పించే విధంగా కృషి చేస్తాడని చెప్పడానికి.
– మొగులగాని సందీప్, కబడ్డీ సీనియర్ జాతీయ క్రీడాకారుడు, జనగామ
విజన్ ఉన్న నేత
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 20 : ప్రజలను జాగృతం చేసే నాయకత్వ లక్షణాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్కలంగా ఉన్నాయి. కేంద్రంలో ఉత్తరాది రాష్ర్టాల పెత్తనాన్ని ఎదిరించే సత్తా ఆయనకు ఒక్కడికే ఉంది. తెలంగాణ పథకాలు దేశంలో అమలు చేస్తే అన్ని రాష్ర్టాలు బాగుపడతాయి. జాతీయ రాజకీయాల్లో రాణించే సత్తా సీఎం కేసీఆర్‌కే ఉంది. హైదరాబాద్‌లో సైతం ఒలింపిక్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు అమలు జరగాలంటే సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిందే.
– బొడ్డు విష్ణువర్ధన్, ఇండియన్ హ్యాండ్‌బాల్ కోచ్
దేశం చూపు.. తెలంగాణ వైపు
దేవరుప్పుల, సెప్టెంబర్ 20 : తెలంగాణలో అమలవుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు ఆకర్షిస్తున్నాయి. కేసీఆర్ వంటి దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంటే అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతు కుటుంబాలు బాగుపడతాయనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది. కేసీఆర్ కొత్త రాష్ట్రమైన తెలంగాణలో సాగునీరు, విద్యుత్‌తో పాటు పేద వర్గాలకు ఆసరా, కల్యాణలక్ష్మి అందించి వారి కళ్లలో వెలుగులు నింపుతున్నాడు. మరోవైపు ఏ రైతు కుటుంబం ఆర్థికంగా కుంగిపోవద్దని పెద్దమనసుతో ప్రతి ఎకరాకు నీరందిస్తూనే, పంటలకు పెట్టుబడి సాయం చేస్తూ ఆసరా అవుతున్నాడు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5లక్షల రైతు బీమా అందిస్తూ వారి కొండంత ధీమా ఇస్తున్నాడు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ధనికవర్గాల కొమ్ముకాస్తూ, పేదలను పట్టించుకోవడం మరిచింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణను పాలిస్తున్న కేసీఆర్‌ను దేశానికి నాయకత్వం వహించాలి.
– గోలి ఉప్పల్‌రెడ్డి, వెటరన్ కబడ్డీ క్రీడాకారుడు, దేవరుప్పుల
కేసీఆర్ పాలనతో దేశానికి ఉజ్వల భవిష్యత్
కృష్ణకాలనీ, సెప్టెంబర్ 20 : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వచ్చినట్లయితే ఆయన పాలనలో దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. దేశంలో ప్రస్తుతం పేదలు, రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేంద్రంలోని మోదీ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమయంలో దేశానికి మంచి కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలి. అప్పుడే తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయి. దేశంలోని రైతులకు అందిస్తే పంట సాయం అందుతుంది. వ్యవసాయాన్ని నమ్ముకొని బతికే ఎంతోమందికి మేలు జరుగుతుంది. కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో నిర్మిస్తారు. అలాగే నిరుద్యోగులకు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. మిషన్ భగీరథ లాంటి పథకంతో తాగునీరు సమస్య తీరుతుంది. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వస్తాయి.
– హట్కర్ రఘువీర్, అథ్లెటిక్ క్రీడాకారుడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
అన్ని రంగాలు బాగుపడతాయి..
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 20 : కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే క్రీడారంగానికి మంచి గుర్తింపు వస్తుందని వంద శాతం నమ్ముతున్నాం. ఇప్పటివరకు ఎన్నో పార్టీలను చూశాం కానీ ఎవరు కూడా ఏ సామాజిక వర్గానికీ పట్టించుకోలేదు. కేసీఆర్ సారు మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ, కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందిస్తున్నారు. విద్యార్థుల కోసం మండల స్థాయి నుంచి జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అంతే కాకుండా ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం ప్రతి గ్రామంలో లక్షలు వెచ్చించి తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ప్రజల కోసం నిత్యం ఆలోచించే వ్యక్తి కేసీఆర్. ఇలాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి ఉంటే దేశంలోని అన్ని రంగాలతో పాటు క్రీడారంగం కూడా కచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మాలాంటి క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుంది.
– నీరటి సాయిశ్రీ, క్రీడాకారిణి, బాల్ బ్యాడ్మింటన్ తెలంగాణ కెప్టెన్, స్టేషన్‌ఘన్‌పూర్
క్రీడారంగానికి మంచిరోజులొస్తాయి..
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 20 : దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అగ్రభాగాన నిలుపుతున్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల ప్రజలు సైతం కోరుకుంటున్నారు. క్రీడారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ తరహా ప్రగతిని, పాలనను అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి చేస్తారు.
– బైరబోయిన కైలాస్‌యాదవ్, ఇండియన్ జూడో కోశాధాకారి, ఉమ్మడి వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి
గణనీయ అభివృద్ధి కేసీఆర్‌కే సాధ్యం
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 20 : దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌తోనే సమూలమైన మార్పు వస్తుంది. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తున్న దమ్మున్న నాయకుడాయన . 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఎనిమిదేళ్లలో చేసి చూపించారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రాకను స్వాగతిస్తున్నాం. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ నైపుణ్యం, భాషా పరిజ్ఞానం, ప్రజల కష్టసుఖాలు తెలిసినవారు. ఇలాంటి నాయకుడు దేశానికి నాయకత్వం వహించాల్సిందే.
– మూగల కుమార్‌యాదవ్, వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు