ఖానాపురం, సెప్టెంబర్ 20: సినీ ఫక్కీలో డీసీఎం అడుగుభాగాన ప్రత్యేకంగా తయారు చేయించిన బాక్స్‌లో 2కిలోల చొప్పన ప్యాక్ చేసిన 275 ప్యాకెట్లను అమర్చిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎం నిండా ఖాళీ ట్రేలను నింపారు. ముందు పైలట్‌గా ఒక కారు, బైక్‌లు నడుపుకుంటూ గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. అచ్చు సినిమా తరహా సన్నివేశాన్ని తలపించేలా జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
ఒడిశాలోని బలిమెల నుంచి కర్ణాటకకు డీసీఎం వాహనంలో గంజాయిని తరలిస్తున్నారని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో మంగళవారం నర్సంపేట రూరల్ సీఐ సూర్యప్రసాద్ ఆధ్వర్యంలో ఖానాపురం మండలం బుధరావుపేట శివారులో ఎన్‌హెచ్-365 వెంట పెట్రోలింగ్ చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన డీసీఎం వాహనాన్ని, కారు, బైక్‌ను నిలిపివేసి తనిఖీ చేయగా రూ. కోటికి పైగా విలువ చేసే 550 కిలోల గంజాయి కనిపించింది.
వాటిల్లో నుంచి 8మంది వ్యక్తులు దిగి పారిపోతుండగా పోలీసులు వెంబడించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఖానాపూర్ మండలం మంగళవారిపేటకు చెందిన బానోత్ చందు, కన్నబోయిన దుర్గాప్రసాద్, రాయపర్తి మండలం గుబ్బాడి తండాకు చెందిన గుగులోత్ అనిల్, బానోత్ మహేందర్, కొత్తగూడెం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌రా వు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామారాజు జిల్లాకు చెందిన కత్తి చిన్నారెడ్డి ఉన్నారు. ప్రధాన నిందితుడు నరసింహారావుతోపాటు ఒకరు పరారీలో ఉన్నారు. ఆ తర్వాత స్వాధీనం చేసుకున్న వాహనాలను వరంగల్ కమిషనరేట్ కార్యాలయానికి తరలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి నిందితుల అరెస్టును చూపించారు.
చికిత్స పొందుతూ ఒకరి మృతి
సంగెం, సెప్టెంబర్ 20: మండలంలోని బాలునాయక్ తండాకు చెందిన ఓ వ్యక్తి అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కేలోత్ కిషన్ (46) నాలుగేళ్ల క్రితం రెండెకరాల వ్యవసాయ భూమిని కొనుగో లు చేయడంతోపాటు ఏడాది క్రితం ఇల్లు కట్టాడు. ఈ క్రమంలో అప్పు చేయగా, వాటిని ఎలా తీర్చాలనే బాధపడుతూ ఈ నెల 15న పత్తిచేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి పడిపోయా డు. గమనించిన కుటుంబసభ్యులు ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై జైపాల్‌రావు తెలిపారు.