ములుగు (నమస్తే తెలంగాణ)/వెంకటాపూర్,సెప్టెంబర్18 : తెలంగాణలోని చారిత్రక కట్టడాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తింపు తేవడంతో పాటు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయ ప్రాంగణంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ముగింపులో భాగంగా రామప్ప వైభవం కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య నేతృత్వంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి దయాకర్‌రావుతోపాటు రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ హాజరయ్యారు.
రామప్ప విశిష్టతకు ప్రచారం కల్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖ సంగీత కళాకారుడు, పద్మశ్రీ శివమణితో సంగీత కచేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబాటుకు గురైందని, ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేసిన పోరాటంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో చారిత్రక కట్టడాలకు గుర్తింపు వస్తోందన్నారు. రామప్పకు మంచి రోజులు రానున్నాయన్నా రు.
సీఎం కేసీఆర్ రామప్ప అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా యునెస్కో గుర్తింపు రావడానికీ కృషి చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ.11 కోట్లతో పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. ములుగును జిల్లాగా ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపాలిటీగా మార్చి మెడికల్ కాలేజీ మంజూరు చేసినట్లు చెపారు. రానున్న రోజుల్లో పర్యాటక ప్రాంతంగా విలసిల్లనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కళలకు పుట్టినిల్లు తెలంగాణ :మంత్రి సత్యవతిరాథోడ్
కళలకు తెలంగాణ గడ్డ పుట్టినిల్లని, ప్రతి గ్రామం ఘన చరిత్ర కలగి ఉందని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ప్రజల పోరాట స్ఫూర్తి భావి తరాలకు తెలిపేందుకే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. రూ.36 కోట్లతో రామప్ప అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అందుకోసమే అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
కట్టిపడేసిన శివమణి సంగీతం
వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా రామప్ప ఆలయ ప్రాంగణంలో ప్రముఖ సంగీత కళాకారుడు శివమణితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిం చారు. సుమారు గంటన్నర పాటు వివిధ సంగీత వాయిద్యాలతో ఆహూతులను కట్టేపడేశారు. శివమణి బీట్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ కరతాల ధ్వనులతో అభినందించారు. ప్రదర్శన అనంతరం శివమణి మాట్లాడుతూ రామప్పలో ప్రదర్శన చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, కాకతీయుల కట్టడం అద్భుతంగా ఉందని కొనియాడారు. రామప్ప విశిష్టత గుర్తించి ఇంటర్నెట్, యూట్యూబ్‌లో తెలుసుకున్నాను. కానీ, నేడు ప్రత్యక్షంగా చూసే అదృష్టం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శివమణిని మంత్రులు ఘనంగా సన్మానించారు. అంతకు ముదు శివమణి డ్రమ్స్ బీట్‌కు మంత్రులు, ఎమ్మెల్యే, జడ్పీచైర్మన్, రెడ్కో చైర్మన్ నృత్యం చేశారు. బొంపెల్లి సుధీర్‌రావు శిష్యులు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. రాష్ట్ర రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి, జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే సీతక్క, ములుగు, హనుమకొండ జడ్పీచైర్మన్లు కుసుమ జగదీశ్వర్, సుధీర్‌కుమార్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్, ఐటీడీఏ పీవో అంకిత్, ఏఎస్పీలు సుధీర్రామ్నాథ్కేకన్, అశోక్‌కుమార్, వెంకటాపూర్ జడ్పీటీసీ గై రుద్రమదేవి, ఎంపీపీ బుర్ర రజిత, సర్పంచ్ డోలి రజిత, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.