గిర్మాజీపేట, సెప్టెంబర్ 18 ;తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. వేడుకల చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు తమ ఆటాపాటలతో హోరెత్తించారు. వరంగల్ చౌరస్తాలోని మహేశ్వరి గార్డెన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ గోపి హాజరై స్వాతంత్య్ర సమరయోధులతో పాటు కవులు, కళాకారులను ఘనంగా సన్మానించి పోరాట యోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సంబురం అంబరాన్నంటింది. ముగింపు వేడుకల్లో భాగంగా ఆదివారం స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానాలు చేయగా కళాకారుల చిందు యక్షగాన, ఒగ్గుకథ, పేరిణి శివతాండవం, బోనాలు, కోలాటాలు.. తదితర కళా ప్రదర్శనలు అలరించాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణంలో కార్యక్రమాలు జరిగాయి. ములుగు జిల్లా రామప్ప ఆలయ ప్రాంగణంలో ‘రామప్ప వైభవం’ పేరిట నిర్వహించిన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ వాయిద్యకారుడు శివమణి తన బ్యాండ్ తో శ్రోతల్ని ఉర్రూతలూగించారు.
కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ములుగు, హనుమకొండ జడ్పీ చైర్మన్లు కుసుమ జగదీశ్వర్, సుధీర్‌కుమార్, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పాల్గొన్నారు. జనగామలో ‘కవులు-కళాకారుల’ సాంస్కృతిక ప్రదర్శనలు వైభవంగా జరుగగా కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్‌చంద్రపవార్ పాల్గొని కళాకారులతో నృత్యం చేసి ఉత్సాహపరిచారు. వరంగల్‌లో జరిగిన ఉత్సవాల్లో కలెక్టర్ గోపి పాల్గొని స్వాతంత్య్ర సమర యోధులను సన్మా నించారు. భూపాలపల్లిలో జడ్పీ చైర్పర్సన్ శ్రీహర్షిణి, కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఉత్సవాలను ప్రారంభించారు.