గిర్మాజీపేట, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రాంతాన్ని రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి తీసుకొచ్చిన తెలంగాణ యోధుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అని కలెక్టర్ బీ గోపి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం వరంగల్ చౌరస్తాలోని మహేశ్వరి గార్డెన్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై స్వాతంత్య్ర సమరయోధులతో జ్యోతి ప్రజ్వలన చేయించారు. ఈ సందర్భంగా గోపి మూడు రోజులపాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసిన జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందించారు. మహనీయుల చరిత్ర నేటి తరానికి తెలియాజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.
అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్లు భూక్యా హరిసింగ్, శ్రీవత్స కోట, స్థానిక కార్పొరేటర్ గందె కల్పనా నవీన్ శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడు బొమ్మినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తెలంగాణలోని స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు.
సాంస్కతిక కార్యక్రమాల్లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, తాళ్ల సునీల్ బృందం అలరించింది. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీపీఆర్వో బండి పల్లవి, డీఎంహెచ్వో డాక్టర్ కే వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి ఎం శారద, ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్, అధికారులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.