నర్సంపేట రూరల్, సెప్టెంబర్18: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. మండలంలోని పాతముగ్దుంపురం, ముగ్దుంపురం, రాజపల్లి, గురిజాల, జీజీఆర్‌పల్లి, చిన్నగురిజాల, గుంటూరుపల్లి, లక్నేపల్లి, రామవరం, మహేశ్వరం, రాములునాయక్‌తండా, ముత్తోజిపేటలో కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను ఆదివారం పెద్ది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సును కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను దేశ ప్రజలంతా తిప్పికొడుతున్నారని, ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకొని రాష్ర్టాలపై ఎలాంటి పక్షపాతం లేకుండా దేశాభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు.
పేద కుటుంబాల్లో చిరునవ్వు
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం 10 లక్షల మందికి నూతన పింఛన్లు మంజూరు చేసిందని, పాతవి 36 లక్షలతో కలిపి మొత్తం 46 లక్షల మందికి టీఆర్ఎస్ సర్కారు పింఛన్లు అందిస్తుందని తెలిపారు. 12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం పింఛన్ల రూపంలో నిరుపేదలకు పంపిణీ చేస్తుందని చెప్పారు. నూతన పింఛన్లు పొందిన లబ్ధిదారుల ఆశీస్సులు సీఎం కేసీఆర్‌పై ఎల్లవేళలా ఉండాలని కోరారు.
దసరా తర్వాత సొంత స్థలం ఉన్న నిరుపేదలు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకునేందుకు రూ. 3 లక్షలు మంజూరు చేస్తామని పెద్ది చెప్పారు.
తెలంగాణపై విషం కక్కుతున్న బీజేపీకి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు మురాల మోహన్‌రెడ్డి, ఆకుల రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, సర్పంచ్‌లు కుండె మల్లయ్య, సుంకరి లావణ్య, పెండ్యాల జ్యోతి, నామాల భాగ్యమ్మ, గొడిశాల మమత, తుత్తూరు కోమల, సుజాత, గొడిశాల రాంబాబు, కవిత, మాధవి, గోలి శ్రీనివాస్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కొండల్‌రెడ్డి, డాక్టర్ కోరె రమేశ్, కిషన్‌నాయక్, పెండ్యాల సదానందం పాల్గొన్నారు.
కొత్తూరులో గుర్తింపు కార్డుల పంపిణీ
రాయపర్తి: కొత్తూరులో కొత్త పింఛన్‌దారులకు గుర్తింపు కార్డులను సర్పంచ్ కందికట్ల స్వామి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా ప్రతినిధి మందాడి సుదర్శన్‌రెడ్డి, ఉప సర్పంచ్ అంబటి రమాదేవి, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ పాలెపు శ్రీనివాసరావు, కారోబార్ కందికట్ల సురేశ్‌కుమార్, సీఏ యాకలక్ష్మి పాల్గొన్నారు.