పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 17 : మత రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పి కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి పిలుపు ఇచ్చారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా వరంగల్ సీకేఎం కళాశాల మైదానంలో శనివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తుత్న వారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వివేకంతో విద్వేవాన్ని ఓడిస్తూ, సకల జనుల విశ్వాసంతో తెలంగాణ అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలని పేర్కొన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం స్పూర్తితో జాతి సమగ్రత నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చెదర నివ్వకుండా కాపాడుకోవాలని ఆయన సూచించారు. స్వేచ్ఛ కోసం తెలంగాణ సమాజం యావత్తు ఉద్యమించిందని గుర్తు చేశారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాలను తలుచుకోవడం అందరి బాధ్యత అన్నారు. సమైక్యత అంటే భౌగోళిక అంశం మాత్రమే కాదని, ప్రజల మధ్య సఖ్యత అని అన్నారు. మన జీవనం విధానం భిన్నత్వంలో ఏకత్వం అని అభివర్ణించారు.
అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి..
తెలంగాణ విద్య, వైద్య రంగాల్లో ఊహించని పురోభివృద్ధి సాధించిందన్నారు. పాలన పారదర్శకంగా ఉండడంతో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. నిరుపేద కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకుంటుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయని తెలిపారు. దశాబ్దాలుగా సామాజిక వివక్షత, అణచివేతకు గురవుతున్న దళితులకు దేశ చరిత్రలో ఏవరూ చేయని విధంగా సీఎం కేసీఆర్ దళిత బందు పథకం అమలు చేస్తున్నారని వివరించారు. రైతుబంధు, రైతు బీమా వల్ల రైతుల కటుంబాల్లో ధీమా పెరిగిందని తెలిపారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా విద్యార్థినులు నృత్యాలు చేశారు. త్యాగధనుల పోరాట పటిమను వివరించారు. పోలీసుల కవాతు, గౌరవ వందనం అందరినీ ఆకుట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్ గోపి, ఆర్డీవో మహేందర్ జీ, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, అదనపు కలెక్టర్ హరిసింగ్, శ్రీవత్స కోట, డీసీపీ వెంకటలక్ష్మి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, రాష్ట్ర సరోగసీ బోర్డు మెంబర్ డాక్టర్ హరిరమాదేవి, కార్పొరేటర్లు సురేశ్‌కుమార్ జోషి, కావటి కవిత తదితరులు పాల్గొన్నారు.