హనుమకొండ, సెప్టెంబర్ 16 : దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండ బాలసముంద్రంలోని హయగ్రీవాచారి మైదానం నుంచి ఆర్ట్స్ కళాశాలల వరకు శుక్రవారం ర్యాలీ తీశారు. ర్యాలీలో చీఫ్ విప్ దాస్యంతో కలిసి జాతీయ జెండాలను పట్టుకొని మేమంతా భారతీయులం.. తెలంగాణ బిడ్డలం అని సగర్వంగా చాటిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు కలిసి సోదరభావాన్ని కల్పించారు. అనంతరం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గం పరిధిలో వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చిందన్నారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ను ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేశారని చెప్పారు. 2014 జూన్ 2న ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందిన్నారు. అంతేకాకుండా అంబేద్కర్ కలలను నిజం చేస్తూనే, తెలంగాణ అనేక రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. టీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని నిరూపించిందని ఆయన స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో పెట్టినవాటితో పాటు పెట్టని అంశాలను కూడా అమలు చేసినట్లు పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో నియోజకవర్గం అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వచ్చేవి కావని, స్వరాష్ట్రంలో అడిగిన వెంటనే నిధులు మంజూరవుతున్నాయని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ర్టా ప్రజలు కూడా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రపంచంలోనే దేశాన్ని అగ్రభాగానే నిలిపే సత్తా కేసీఆర్‌కే ఉందని దేశ ప్రజలు అంటున్నారని తెలిపారు. ములుగు జిల్లాలో ఒక గిరిజన కుటుంబం తమ బిడ్డ పెళ్లికి కొంత డబ్బును గుడిసెలో పెట్టుకుంటే ఆ గుడిసె కాలిపోయిందని తెలిపారు. ఆ కుటుంబానికి అండగా నిలవాలని మా అందరికీ కేసీఆర్ సూచించిన విషయాన్ని గుర్తుచేసి, అలాంటి బాధాతప్త సంఘటన నుంచే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పుట్టాయని వివరించారు. రాష్ట్రం రాకముందు ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా ఉండేవని, స్వరాష్ట్రంలో రూ. వందల కోట్లతో గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అందులో చదివిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు కావడంతోపాటు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని అన్నారు. ఉద్యమ నాయకుడు పాలకుడు కావాలని ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోదన్నారు. అంబేదర్ రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిందని, అందుకు తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టినట్లు చెప్పారు. పార్లమెంట్ భవనానికి కేంద్రం అంబేదర్ పేరు పెట్టాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపితే, బీజేపీ ఎమ్మెల్యే జారుకున్నాడని అన్నారు. కచ్చితంగా పార్లమెంట్‌కు అంబేదర్ పేరు పెట్టాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన 22 మంది పరకాలలో అసువులుబాశారని తెలిపారు. స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో హనుమకొండ జిల్లా అగ్రభాగాన ఉందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు ర్యాలీ విజయవంతమైందని సీపీ తరుణ్‌జోషి అన్నారు. రెండో రోజు ముఖ్య అతిథులచే జాతీయ జెండాలను ఆవిషరించాలన్నారు. పటిష్టమైన పోలీస్ వ్యవస్థ, ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు.
అప్పుడున్న పోలీస్ వ్యవస్థ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవసక్థు చాలామార్పు ఉందని చెప్పారు. దేశంలోనే తెలంగాణ పోలీస్‌కు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డీసీపీ అశోక్‌కుమార్, డీఆర్వో వాసుచంద్ర, తహసీల్దార్ జీ రాజ్‌కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.