వర్ధన్నపేట, సెప్టెంబర్ 16 : భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్న శక్తులను ప్రజలు తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా వర్ధన్నపేటలో అడిషనల్ కలెక్టర్ శ్రీవత్సవ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో జరిగిన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ప్రజలు ఎప్పుడు కూడా మతాలు, కులాల కారణంగా విడిపోలేదని అన్నారు.
అంతేకాకుండా సీఎం కేసీఆర్ నేతృత్వంలో 14 ఏళ్లపాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ప్రజలంతా కలిసికట్టుగా సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు చెప్పారు. నిజాంకు వ్యతిరేకంగా, ప్రత్యేక రాష్ర్టానికి జరిగిన ఏ ఉద్యమంలో కూడా బీజేపీ నేతలు, వారి కుటుంబాల పాత్ర లేదని అన్నారు. కానీ, దేశాన్ని ఇప్పటికే భ్రష్టు పట్టించిన బీజేపీ నేతలు తెలంగాణలో కూడా విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన కేసీఆర్‌తోనే దేశం, రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రధానంగా తెలంగాణకు సాగునీటిని అందించడం కోసం గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో తెలంగాణ సస్యశ్యామలమైందని అన్నారు. అంతేకాకుండా ఆసరా పింఛన్లతో వృద్ధులు, వితంతువులకు గౌరవం లభించడంతో పాటుగా కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులు, పేదలు సంతోషంగా జీవిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలంతా అండగా ఉండాలని మంత్రి దయాకర్‌రావు కోరారు. గాంధీని చంపినోళ్లు ఎవరో మీకు ఎరుకేనా.. అని మంత్రి ప్రశ్నించగా సభకు వచ్చినవారంతా ‘తెలుసు.. తెలుసు’ అని సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో జరిగిన పోరాటాలు, నిజమైన చరిత్రను మేధావులు, యువకులు భావితరాలకు అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వజ్రోత్సవాలను నిర్వహిస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేటలో శుక్రవారం జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. చరిత్ర తెలియని విపక్ష పార్టీల నాయకులు తెలంగాణ సమాజాన్ని, భావితరాలను పక్కదారి పట్టించేలా కట్టు కథలు చెబుతున్నారని అన్నారు.
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే తెలంగాణతోపాటు కొన్ని సంస్థానాలకు 1948లో సెప్టెంబర్ 17న స్వాతంత్రం రావడం జరిగిందన్నారు. ఆనాటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్ నేతృత్వంలో నిజాం రాజుతో పొట్లాడి తెలంగాణను దేశంలో విలీనం చేసినట్లు వివరించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే మూడు రోజుల పాటు సమైక్యతా వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సభ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన చేశారు. వేదికపై ఉన్న ప్రముఖులు, సభకు హాజరైన ప్రజలంతా వందనం చేశారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్, డీఆర్డీవో సంపత్‌రావు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, కమిషనర్ గొడిశాల రవీందర్, పట్టణ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.