నర్సంపేట, సెప్టెంబర్ 16: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని, దేశంలోనే నంబర్‌గా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. నియోజకవర్గంలోని మండలాల నుంచి సుమారు 15 వేల మంది సభకు తరలివచ్చారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జాతీయ జెండాలను చేతబూని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు బతుకమ్మ, బోనాలతో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత జరిగిన సభ లో పెద్ది, బండా ప్రకాశ్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. తెలంగాణలో కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరును సీఎం కేసీఆర్ పెట్టారన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పేరును కొత్త పార్లమెంట్ భవనానికి ఎందుకు పెట్టరని ప్రశ్నించారు.
వచ్చే దసరా కానుకగా నర్సంపేట నియోజకవర్గంలో సొంత స్థలం ఉన్న సుమారు 5 వేల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే పెద్ది హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో వ్యవసాయ, విద్య, వైద్యం, రోడ్లు, ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన అనేక అభివృద్ధి పనులను మంజూరు చేయించి పూర్తి చేయిస్తున్నట్లు వివరించారు. నర్సంపేటలో జిల్లా స్థాయి దవాఖానను రూ. 60 కోట్లతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో రూ. 58 కోట్లతో 63,398 మందికి రైతుబంధు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రైతుబీమా పథకంలో 359 మంది బాధిత కుటుంబాలకు రూ. 19.50 కోట్లు అందించామన్నారు.
రాజకీయాలకతీతంగా ఎల్వోసీలతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 9,670 మందికి రూ. 30 కోట్లు అందించామని వెల్లడించారు. నియోజకవర్గంలో 29 రైతు వేదికలు నిర్మించామన్నారు. ధాన్యం నిల్వల కోసం అన్ని మండలాల్లో మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మిస్తున్నట్లు వివరించారు. హెల్త్ సబ్ సెంటర్ల భవనాలను 47 గ్రామాల్లో నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 35 వేల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా మరో 12 వేల మందికి మంజూరైనట్లు వివరించారు. దళితబంధు పథకంలో కొత్తగా నియోజకవర్గంలో 1500 మందికి యూనిట్లు అందిస్తామన్నారు.
62 గ్రామాలకు బీటీరోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరుస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, అదనపు కలెక్టర్ హరిసింగ్, జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, ఏసీపీ సంపత్‌రావు, కమిషనర్ వెంకటస్వామి, ఆర్డీవో పవన్‌కుమార్, తాసిల్దార్ రామ్మూర్తి, బీరం సంజీవరెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, ఎంపీపీలు విజేందర్, రమేశ్, ప్రకాశ్‌రావు, ఊడుగుల సునీత, కాట్ల కోమల, మోతె కళావతి, జడ్పీటీసీలు పత్తినాయక్, స్వప్న, జయ, కేయూ పాలక మండలి సభ్యుడు మదన్‌కుమార్, జేడీఏ ఉషాదయాళ్, డీసీవో సంజీవరెడ్డి పాల్గొన్నారు.