పరకాల, సెప్టెంబర్ 16 : తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని పరకాలలోని వ్యవసాయ మార్కెట్ వద్ద నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.
పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 15 వేల మందితో వజ్రోత్సవాల సభను నిర్వహిస్తోందని తెలిపారు. ఎంతోమంది పోరాట యోధుల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సంస్థానాన్ని భారత దేశంలో కలిపారని అన్నారు.
కొంత మంది కుట్రలతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తెలంగాణ, ఆంధ్రాను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేశారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన తర్వాత తెలంగాణకు అన్యాయం జరిగిందని, తొలిదశ, మలిదశ పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని వివరించారు. 8 ఏండ్లలో రాష్ర్టాన్ని ఒక విజన్‌తో పాలించిన సీఎం కేసీఆర్ అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో నిలిపారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.
భారత దేశంలో శుభ్రపరిచిన తాగునీరు అందించిన ఏకైక రాష్ట్రం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
గణనీయ అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విషం చిమ్ముతుందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీకి గిట్టడం లేదని, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
గాంధీ పాటించిన అహింసా మార్గంతో రాష్ర్టాన్ని సాధించుకున్నామని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే సాధ్యమైందన్నారు. అందుకోసమే సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి సోయి ఉంటే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా.రామకృష్ణ పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్‌తో తాను ఎమ్మెల్యే అయ్యానని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని పరకాల పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో చల్లా మాట్లాడారు. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే పేద బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లతోనే ఎంతో మంది ఉన్నత స్థానాలకు చేరారని ఆయన చెప్పారు. చివరకు తాను కూడా అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్లనే ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. గతంలో పరకాల నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కాగా, నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ స్థానంగా మారడంతో తాను ఎమ్మెల్యే అయ్యానన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13నెలల తర్వాత అనేక పోరాటాల వల్ల తెలంగాణ సంస్థానం దేశంలో కలిసిందని ఎమ్మెల్యే చల్లా అన్నారు. ఈ పోరాటంలో పరకాల, పరకాల చుట్టు ప్రాంతాలకు చెందిన అనేక మంది యోధులు భాగస్వాములయ్యారని, వారిలో కొంత మంది అమరులయ్యారని పేర్కొన్నారు. పరకాల ప్రాంతంలో ఆనాడు జరిగిన సంఘటన వాస్తవిక దృశ్యమే అమరధామమని అన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమని, అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్‌కు అండగా ఉండి మద్దతు తెలిపాలని కోరారు.