నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 14 ;‘సహజ.. మానవ వనరుల వినియోగంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న అవగాహన అంతాఇంతా కాదు.. ఆయన విజన్ ఉన్న వ్యక్తి.. ఏ ప్రాంత ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉంటాయో.. వాటిని ఎలా తీర్చాలో ఆయనకు మాత్రమే తెలుసు.. అందుకే ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలి.. దేశ పాలనా పగ్గాలు చేపట్టాలి’ అని సర్పంచ్‌లు ముక్తకంఠంతో కోరుతున్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల పరిస్థితులు కేసీఆర్‌కు తెలుసునని, తెలంగాణలా దేశమంతా బాగుపడాలంటే ఆయన జాతీయ స్థాయిలో ముఖ్యపాత్ర పోషించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘కర్షకులు, కార్మికులు, కులవృత్తులవారి అభ్యున్నతిని కోరేవారే నిజమైన నాయకుడని, ఆ లక్షణాలు కేసీఆర్‌లో మెండుగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
కర్షకులు, కార్మికులు, కులవృత్తులవారి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించరు.. ఇలా అందరి బాగు కోరేవాడే నిజమైన నాయకుడు. ఇలాంటివ్యక్తి దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశం మొత్తం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి. ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కేసీఆర్‌కు తెలుసు’ అంటున్నారు సర్పంచ్‌లు. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. ఏండ్లకేండ్లు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా ఎదగాల్సిన దేశం రోజురోజుకూ దిగజారిపోతున్నదని, ఇలాంటి సమయంలో కేసీఆర్‌లాంటి వ్యక్తి దేశానికి అవసరమని కుండబద్దలు కొడుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని, మూలమూలకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని చెబుతున్నారు. భావితరాలు బాగుపడాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
కేసీఆర్‌తోనే మార్పు సాధ్యం
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినప్పటికీ దేశంలో ఇంకా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరుగలేదు. మార్పు రావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే అది సాధ్యమవుతుంది. పోరాడి సాధించిన తెలంగాణను ఎనిమిదేండ్లలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. ఏ రాష్ట్రంలో లేని పథకాలను అమలు చేస్తున్నారు. రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరంటు, ప్రాజెక్టుల నిర్మాణంతో రైతాంగాన్ని ఆదుకుంటున్నారు. ఇవన్నీ దేశంలోని రైతులందరికీ అందాల్సిన అవసరం ఉంది. మూడు, నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లా డే వాక్చాతుర్యం కేసీఆర్ సొంతం. ఆయనకు దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసే సత్తా ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలంతా ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
– కొమ్మిడి నిరంజన్‌రెడ్డి, సర్పంచ్, ఎల్కతుర్తి
సమయం ఆసన్నమైంది..
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అభివృద్ధిలో దేశంలోనే రాష్ర్టాన్ని ఆయన ముందంజలో నిలిపాడు. యావత్ దేశ ప్రజానీకం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నది. ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు తమకూ అందాలని ఎదురు చూస్తున్నది. రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పెరిగి పంటలు విరివిగా పండుతున్నాయి. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు వెలిగిపోతున్నాయి. నర్సరీలు, డంపింగ్ యార్డ్లు, చెత్తను వేరు చేయడం, అంతిమ సంస్కారాలకు వైకుంఠధామాలు వంటి ఎన్నో సౌకర్యాలను కేసీఆర్ ఏర్పాటు చేశారు. ముందు చూపు గలిగిన వ్యక్తిగా దేశాన్ని ముందంజలో నడిపే శక్తి ఆయనకే ఉంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో పేదోడు మరింత పేదగా మారుతుండగా, ఉన్నోడు మరిన్ని కూడబెట్టుకుంటున్నాడు. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు కట్టబెడుతూ దేశ ప్రజలను మోసం చేస్తున్న పార్టీలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రత్యామ్నాయం కేసీఆర్ పార్టే.
– పువ్వాటి రాణి, సర్పంచ్, గుంటూర్పల్లి, చిట్యాల
దేశమంతటా అభివృద్ధి
ప్రస్తుతం దేశానికి విజన్ ఉన్న నాయకుడు అవసరం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తే చక్రం తిప్పి ప్రపంచ పటంలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం ఖాయం. ప్రస్తుతం పలు రాష్ర్టాల్లో ప్రజలు సరైన తిండి, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొట్ట చేతపట్టుకొని వలసలు వెళ్తున్నారు. ఉద్యమ నాయకుడిగా ప్రజల కష్టాలపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ రాష్ర్టాన్ని సమర్థవంతంగా పాలిస్తూ ప్రగతి పథంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో ఆవిష్కృతమవుతోంది. పల్లెలు స్వచ్ఛత, పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఇంటింటికీ తాగు నీరు, వీధివీధినా సిమెంటు రోడ్లు దర్శనమిస్తున్నాయి. దేశమంతటా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేత అవసరం.
– బానోత్ కృష్ణ కుమారి, సర్పంచ్, కస్తూరినగర్, బయ్యారం
రాష్ట్ర పథకాలు దేశమంతటా..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభసూచకం. కేంద్రంలో అధి కారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండగా, రాష్ట్రంలో కేసీఆర్ వాటికి పునర్జీవం పోస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనతో దేశం అన్ని రంగాల్లో వెనుకబడింది. కేసీఆర్ తెలంగాణలో ఉచితంగా నిరంతర విద్యుత్ అందిస్తుంటే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తోంది. రాష్ట్రంలో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేంద్రం ప్రతి ఏడాది ఇచ్చే ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు రాష్ర్టానికే ఎక్కువ వస్తున్నాయి. మోదీ ప్రభుత్వ హయాంలో ధనికుల సంపద మాత్రం పెరిగింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశమంతటా అమలవుతాయి.
– అంకతీ నాగేశ్వర్రావు, సర్పంచ్, విశ్వనాథపురం, గీసుగొండ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు
ముందు చూపున్న నాయకుడు
కేసీఆర్ ముందు చూపున్న నాయకుడు. ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రాష్ర్టాన్ని సాధించారు. ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్స్, ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండి, ఊరూరా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం కేసీఆర్ పాలనను చూసి మెచ్చుకుంటోంది. ఇలాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే కేసీఆర్ ప్రధాని అయితే దేశం ప్రగతిపథంలో దూసుకెళ్తుంది.
– బొల్లవేణి రాణి, సర్పంచ్, జయగిరి, హసన్‌పర్తి
ప్రజలు స్వాగతిస్తున్నరు
కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నరు. అలుపెరుగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించి, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కింది. ప్రత్యేక చొరవతో ప్రణాళికలు రచిస్తూ రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాడు. దేశంలో బీజేపీ పాలనలో నాయకత్వం లోపించి అస్తవ్యస్తంగా మారింది. ఈ తరుణంలో సరైన నాయకత్వం, సమర్థ పాలన కేసీఆర్‌తోనే సాధ్యమని దేశ ప్రజలు భావిస్తున్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లో రావడం శుభపరిణామం. ఆయన పార్టీకి పూర్తి మద్ద్దతు తెలుపుతున్నాం. బీజేపీ, మోదీ మత విద్వేషాలను రెచ్చ గొడుతూ సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తున్నాడు. ఆ పార్టీతో ప్రజలు విసిగిపోయారు. అందరి సంక్షేమం కోసం పాటుపడే కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలు దేశ ప్రజలకు అందాలంటే ఆయన రావాలి.
– శ్రీపతిబాపు, సర్పంచ్, మహదేవపూర్
రైతులు, కార్మికులకు మేలు జరుగుతది
దేశంలో ఎంతో మంది నాయకులు వచ్చారు.. పోయారు. కానీ దేశంలో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కడా లేవు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నది. రైతులకు రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరంటు ఇవ్వడం కేసీఆర్‌తోనే సాధ్యమైంది. ఇప్పుడున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల వస్తువుల ధరలు పెంచుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నది. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే దేశానికి కేసీఆర్‌లాంటి నాయకుడు కావాలి. ఆయనతోనే దేశంలోని రైతులకు, కార్మికులకు మేలు జరుగుతది.
– మందుల శిరీష, సర్పంచ్, రామవరం
భావితరాల కోసం కేసీఆర్ రావాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. ఊర్లళ్ల ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా ఉంటోంది. బీటీ రోడ్లు వచ్చాయి. హరితహారంలో నాటిన మొక్కలతో పల్లెల్లో పచ్చదనం పరుచుకుంది. ఇలా ప్రతి ఊరిని బాగు చేయాలన్న తపన ఉన్న వ్యక్తి దేశ పాలకుడైతే దేశంలోని ప్రతి ఊరు బాగుపడుతుంది. ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆయనకు తెలుసు.. భవిష్యత్ తరాలు బాగుండాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే..
– సామల జమున, సర్పంచ్, పెంచికల్ పేట