వర్ధన్నపేట, సెప్టెంబర్ 14: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 16వ తేదీన 15 వేల మందితో సభ నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట ఫిరంగిగడ్డ ప్రాంతంలోని జఫర్‌గఢ్ రోడ్డు పక్కన సభ నిర్వహించనున్న స్థలాన్ని కలెక్టర్ గోపి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు వర్ధన్నపేటలో 16న భారీ ర్యాలీ నిర్వహించడంతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు, మహిళలు, ప్రజాప్రతినిధులు తరలిరానున్నట్లు తెలిపారు.
16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో నియోజకవర్గంలోని సకల జనులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రమేశ్ పిలుపునిచ్చారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ మూడు రోజులపాటు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 16న జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించడంతోపాటు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 17న జిల్లాకేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు మండలకేంద్రాల్లోని ఆఫీసుల్లో అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారన్నారు. 18న జిల్లాలోని ప్రముఖులు హైదరాబాద్‌కు తరలివెళ్తారన్నారు. 16న వర్ధన్నపేటలో జరిగే సభకు వచ్చే వారికి భోజన వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలో అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏసీపీ శ్రీనివాసరావు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
మూడు రోజులపాటు ఉత్సవాలు
పోచమ్మమైదాన్: ఈ నెల 16, 17, 18వ తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను దేశాయిపేట సీకేఎం కళాశాల మైదానంలో కలెక్టర్ గోపీ, పోలీసు అధికారులు పరిశీలించారు. 16న 15 వేల మందితో ర్యాలీలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, అన్ని విభాగాల సిబ్బంది, ప్రజలు పాల్గొననున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు సురేశ్‌కుమార్ జోషి, కావటి కవితా రాజుయాదవ్, దిడ్డి కుమారస్వామి, ఎండీ ఫుర్ఖాన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.