వరంగల్, మార్చి 3(నమస్తేతెలంగాణ) : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా ప్రభుత్వం రైతు ఉపకరణాల అద్దె కేంద్రాలు ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)ల మహిళలకు ఆర్థికం గా చేయూతనిస్తున్నది. ఈ క్రమంలో ముందుకొచ్చిన మండల మహిళా సమాఖ్యలకు సబ్సిడీలు అందజేస్తున్నది. ప్రయోగాత్మకంగా జిల్లాలో చెన్నారావుపేట కేంద్రంగా ఒక ఆధునిక వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం ఏర్పాటు చేసింది. ఇది చెన్నారావుపేట మండల కేంద్రంలోని ఆశాజ్యోతి మండల సమాఖ్య కార్యాలయంలో పనిచేస్తున్నది. దీన్ని 2020 అక్టోబర్ 12న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లోని 110 మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లో సభ్యులైన 1,799 మంది మహిళలతో కూడిన అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ఈ కేంద్రం నిర్వహిస్తున్నది. దీనికి ప్రభుత్వం సెర్ప్ ద్వారా గ్రాంటు కింద రూ.25 లక్షలు ఇచ్చింది.
ఈ నిధులతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ట్రాక్టర్, ట్రాలీ, కల్టివేటర్, రొటవేటర్, కాటన్చాపర్, పవర్‌వీడర్, ప్యాడీ బేలర్, బ్రేష్ కట్టర్, మేజ్, బ్యాటరీ స్ప్రేయర్, తైవాన్ స్ప్రేయర్, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ వంటి ఆధునిక వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసి అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యకు అందజేశారు. ఈ సమాఖ్య ఆధునిక వ్యవసాయ పనిముట్లను తక్కువ రేట్లపై అద్దెకు ఇస్తున్నది. అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యలో సభ్యులైన మహిళలందరివీ రైతు కుటుంబాలే. వీరితో పాటు చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని రైతులు ఈ కేంద్రంలోని పనిముట్లను అద్దెపై వినియోగించుకుంటున్నారు. దీంతో ఇక్కడి రైతులకు వ్యయ ప్రయాసలు తగ్గాయి. సమయానికి ఆధునిక పనిము ట్లు అద్దెకు లభిస్తున్నాయి. శ్రమ, ఖర్చు తగ్గడంతో రైతులకు పెట్టుబడి భారం కూడా తగ్గింది. ఒక సంవత్సరంలోనే రూ.8.60 లక్షల వ్యాపారంతో ఈ సమాఖ్య రాష్ట్రంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచింది.
చెన్నారావుపేటలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ పనిముట్ల కేంద్రం నిర్వహణతో రైతులు, మహిళలకు లబ్ధి చేకూరుతుండడంతో ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా మరో మూడు మండలాల్లో రైతు ఉపకరణాల అద్దె కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాయపర్తి మండలంలో స్వర్ణ భారతి మండల సమాఖ్య, వర్ధన్నపేట మండలంలో బృందావనం మండల సమాఖ్య, నల్లబెల్లి మండలంలో మదర్ థెరిస్సా మండల సమాఖ్యకు ఈ కేంద్రాలను కేటాయించింది. ఒక్కో మండల సమాఖ్యకు రైతు ఉపకరణాల కేంద్రం ఏర్పాటు కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల ఆధునిక వ్యవసాయ పనిముట్లను సమకూర్చేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు మూడు మండల సమాఖ్యలకు ఒక్కో ట్రాక్టర్, టైర్లతో కూడిన ట్రాక్టర్ ట్రైలర్, రొటవేటర్, ప్యాడీ టేలర్, హైడ్రాలిక్ ప్లౌ, డ్రోన్ స్ప్రేయర్‌తో పాటు మేజ్ డెస్క్ కం సెల్లార్, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్, టైన్ కల్టివేటర్, హాఫ్ కేజ్ వీల్స్ కొనుగోలు చేసే ప్రక్రియ చేపట్టారు. ఈ ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రా ల సరఫరాదారుల నుంచి డీఆర్డీఏ కార్యాలయంలో సీల్డ్ కొటేషన్లు స్వీకరిస్తున్నారు.
ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు అందిన సీల్డ్ కొటేషన్లను అదేరోజు సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ సమావేశ మందిరంలో ఓపెన్ చేయనున్నట్లు డీఆర్డీవో ఎం సంపత్‌రావు వెల్లడించారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ రైతు ఉపకరణాల అద్దె కేంద్రాలు రాయపర్తి, వర్ధన్నపేట, నల్లబెల్లి మండల కేంద్రాల్లోని స్వర్ణ భారతి, బృందావనం, మదర్ థెరిస్సా మండల సమాఖ్య కార్యాలయాల్లో పనిచేస్తాయి. వీటిలో ఆయా మండల సమాఖ్యకు ప్రభుత్వం అందజేసే ఆధునిక వ్యవసాయ పనిముట్ల విలువ మొత్తంలో సెర్ప్ ద్వారా 25 శాతం సబ్సిడీగా ఇవ్వనుంది. కొత్తగా మూడు మండలాల్లో ఏర్పడే రైతు ఉపకరణాల కేంద్రాల్లోని ఆధునిక వ్యవసాయ పనిముట్లను ఇక్కడి మండల సమాఖ్యల్లో సభ్యులైన మహిళల కుటుంబాలతో పాటు స్థానికంగా ఉన్న రైతులెవరైనా అద్దెపై ఉపయోగించుకొనే అవకాశం ఉంది. మార్కెట్లో ఉన్న రేట్ల కంటే తక్కువ ధరకు ఈ రైతు ఉపకరణాల అద్దె కేంద్రాల్లో ఆధునిక పనిముట్లు దొరుకుతాయి. ఈ కేంద్రాల ఏర్పాటుతో స్థానిక రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు మార్కెట్ రేట్లకంటే తక్కువ ధరపై అవసరమైన సమయంలో అద్దెకు లభించడంతో పాటు మూడు మండలాల సమాఖ్యల్లో సభ్యులైన మహిళలకు అద్దె డబ్బు రూపంలో ఆదాయం రానుంది.
– ఎం సంపత్‌రావు, డీఆర్డీవో, వరంగల్
రాయపర్తి, వర్ధన్నపేట, నల్లబెల్లి మండలాల్లోని స్వర్ణ భారతి, బృందావనం, మదర్ థెరిస్సా మండల సమాఖ్యలకు ప్రభుత్వం కస్టం హైరింగ్ సెంటర్లను మంజూరు చేసింది. ఒక్కో మండల సమాఖ్యకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలను సమకూర్చుతాం. ఆయా సమాఖ్యకు అందజేసే పరికరాలు, యంత్రాల విలువ మొత్తంపై సెర్ప్ ద్వారా 25శాతం సబ్సిడీ అందనుంది. ప్రస్తుతం ఈ మూడు మండల సమాఖ్యలకు సరఫరా చేయడానికి ట్రాక్టర్లు, ట్రాక్టర్ ట్రైలర్లు, రొటవేటర్లు, ప్యాడీ టేలర్లు, హైడ్రాలిక్ ప్లౌ, డ్రోన్ స్ప్రేయర్లు, మేజ్ డెస్క్ కం సెల్లార్లు, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్, టైన్ కల్టివేటర్, హాఫ్ కేజ్ వీల్స్ కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతున్నది. సాధ్యమైనంత త్వరలో వీటిని కొనుగోలు చేసి మండల సమాఖ్యలకు అందజేస్తాం.