ఏటూరునాగారం, జూలై 28 : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వరదల ప్రత్యేకాధికారి, ఎఫ్సీడీఎ కమిషనర్ కే శశాంక ఆదేశించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల సమీపంలోని జంపన్నవాగు, రామన్నగూడెం పుష్కరఘాట్‌ను ఆయన సోమవారం సందర్శించారు.
దొడ్లవాగు పరిస్థితి, కొండాయివాసుల వివరాలను అధికారుల నుంచి సేకరించారు. రామన్నగూడెం పుష్కరఘాట్, కరకట్ట పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ, సీఈవో సంపత్‌రావు, ప్రత్యేకాధికారి రాంపతి, వివిధ శాఖల అధికారులతో వరదల సంసిద్ధత సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. అవసరమైన మందులు నిల్వ చేసుకోవాలని శశాంక ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్, ఏపీవో వసంత్‌రావు, ములుగు మున్సిపల్ కమిషనర్ సంపత్, నీటి పారుదల శాఖ అధికారి అప్పల నాయుడు, ఈఈ జగదీశ్, డీఈఈ ప్రవీణ్, ఇంజినీరింగ్, ఐటీడీఏ, రెవెన్యూ అధికారులు శ్రీనివాస్, జగదీశ్వర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దొడ్ల సమీపంలో ప్ర త్యేకాధికారి శశాంక కా న్వాయ్‌ను సోమవారం వరద బాధితులు అడ్డగించారు. వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా వివిధ శాఖల అధికారులతో కలిసి జం పన్నవాగును పరిశీలించి తిరిగి వస్తున్న క్రమంలో కొండాయి గ్రామంలోని ముంపు ప్రాంతానికి చెందిన బాధితులు అడ్డుకున్నారు. కొండాయికి చెందిన 25 ఎస్సీ కుటుంబాలు సోమవారం దొడ్ల సమీపంలో గుడిసెలు వేసుకుంటుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు.
ఇదే సమయంలో ప్రత్యేకాధికారి వాగు వద్దకు వచ్చినట్లు తెలుసుకొని రోడ్డుపై బైఠాయించారు. దీంతో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, వివిధ శాఖల అధికారులు బాధితుల వద్దకు చేరుకోగా వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల స్థలాల కోసం దొడ్ల సమీపంలో 20 నుంచి 25 ఎకరాల ప్రభుత్వ స్థలం పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకొని అందజేస్తామని హామీ ఇచ్చారు.