ఏటూరునాగారం, మే 18: మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి పూర్తిస్థాయిలో అధికారులు హాజరుకాకపోవడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ అంతటి విజయ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీడీవో కుమార్, జడ్పీ కోఆప్షన్ వలియాబీ, పంచాయతీరాజ్, ఐసీడీఎస్, ఆర్డబ్ల్యూఎస్, విద్యాశాఖ, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు భిక్షపతి, హేమలత, సతీశ్, సురేందర్, చంద్రకాంత్ హాజరయ్యారు. పలు శాఖల అధికారులు వరుసగా గత మూడు సమావేశాల్లో హాజరు కాకపోవడంతో సమస్యలు ఎవరికీ చెప్పాలంటూ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఎక్సైజ్, రెవెన్యూ, అటవీశాఖ, ఆరోగ్య శాఖ, టీఎస్ఎండీసీతోపాటు పలు విభాగాలకు చెందిన అధికారులు సమావేశంలో పాల్గొనలేదు.
దీంతో తాము సభను బహిష్కరిస్తున్నట్లు వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, ఎంపీటీసీలు కోట నర్సింహులు, జాడీ లక్ష్మీనారాయణ, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖలీల్ ప్రకటించారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఇన్చార్జ్ ఎంపీడీవో కుమార్ తెలిపారు. వారు మాట్లాడుతూ సమావేశానికి రాని అధికారులకు నోటీసులు జారీ చేయాలన్నారు. మండల కేంద్రంలో మూడు వైన్‌షాపులు ఒకేచోట ఏర్పాటు చేసి వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని, ఎైక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
బెల్టుషాపుల్లో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరుపుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నా రు. పోడుభూముల్లో సాగు చేస్తుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, వారిని కట్టడి చేయాలని కోరారు. ఏటూరునాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని వాగు, గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, గోదావరి కరకట్టకు ప్రమాదం పొంచి ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
వరదలు రాగానే అధికారులు లోతట్టు ప్రాంతంలో ఉన్న వారిని ఖాళీ చేయిస్తారని, ప్రమాదం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని ఇసుక తవ్వకాలు జరుగకుండా చూడాలని విన్నవించారు. ఓవర్ లోడుతో వెళ్తున్న ఇసుక లారీలతో జాతీయ రహదారి దెబ్బతిని ద్విచక్ర వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వచ్చే సమావేశానికి అధికారులు హాజరు కాకుంటే వారి కార్యాలయాల వద్దకు వెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఎంపీపీ చాంబర్లో విలేకరుల సమావేశంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మాట్లాడుతూ ఏటూరునాగారం సర్పంచ్ రామ్మూర్తిపై ఇసుకక్వారీ యజమాని సుధీర్ పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఊరుకు జరిగే నష్టాన్ని ప్రజలతో కలిసి ప్రశ్నించినందుకు సర్పంచ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. వెంటనే ఉపసంహరించుకోకుంటే దేనికైనా సిద్ధమన్నారు.
జంపన్నవాగులో తీస్తున్న ఇసుక స్థలం పట్టా భూమి కాదన్నారు. రెవెన్యూ అధికారుల రీ సర్వే చేసి క్వారీ నిలుపుదల చేయాలని కోరారు. ఎంపీపీ విజయ, వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, ఎంపీటీసీలు శ్రీలత, ధనలక్ష్మి, సుమలత, జాడి లక్ష్మీనారాయణ, కోట నర్సింహులు, మండల కోఆప్షన్ సభ్యుడు ఖలీల్, సర్పంచ్‌లు దొడ్డ కృష్ణ, ఈసం రామ్మూర్తి, వంక దేవేందర్, అంతటి నాగారాజు, చేల వినయ్ పాల్గొన్నారు.