భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ప్రభుత్వ దవాఖానల్లో పండ్ల పంపిణీతోపాటు పలుచోట్ల ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు జరిగాయి. మామునూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాలలో కబడ్డీ ఫ్రీడం పోటీలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి ప్రారంభించారు. హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మొక్కలు నాటారు, వరంగల్‌లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి దవాఖాన, అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. – నమస్తే నెట్వర్క్
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబురాలు ఊరూరా, వాడవాడలా అంబరాన్నంటుతున్నాయి. రోజుకో వినూత్న కార్యక్రమం నిర్వహిస్తుండగా, ప్రజలంతా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలు, అనాథాశ్రమాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. క్రీడలు, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యాంగులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన హాస్పిటల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్‌మిశ్రా రోగులకు పండ్లు, మహిళలకు హైజెనిక్ కిట్లు పంపిణీ చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దైవకృప అనాథాశ్రమం, శివారులోని ఆశా అనాథాశ్రమంలోని పిల్లలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్, డీడబ్ల్యూవో నర్మద పండ్లు, పుస్తకాలు, పెన్సిళ్లు అందజేశారు. వరంగల్ జిల్లా మామునూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాలలో ఫ్రీడమ్ కప్ కబడ్డీ పోటీలు నిర్వహించారు.
సీపీ తరుణ్‌జోషి, డీసీపీ వెంకటలక్ష్మి, పోలీసులు కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాల, సబ్ జైల్, రాజరాజేశ్వర అనాథ వృద్ధాశ్రమంలో రోగులు, ఖైదీలు, వృద్ధులకు జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే 21వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించి, గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు.