వ్యవ‘సాయం’లో డ్రమ్ సీడర్ పద్ధతి విప్లవాత్మక మార్పులు తెస్తోంది. నేరుగా వరి విత్తుకునే పద్ధతి ద్వారా వ్యయం తగ్గి ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతోంది. ఈ విధానంలో పెట్టుబడితోపాటు కూలీల ఖర్చు తక్కువే.. దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఇటు సమయం, అటు డబ్బూ ఆదా అవుతోంది. నార్లు ఎదగక నాటు ఆలస్యమయ్యే ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో ఈ విధానంపై రైతాంగం ఆసక్తి చూపుతోంది.
– నర్సంపేట రూరల్, జూలై31
డ్రమ్ సీడర్ సాగుతో తక్కువ నీరు, విత్తనం, పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడిని సాధిస్తుండడంతో దీనిపై రైతుల్లో నమ్మకం పెరిగింది. గ్రామాల్లో కూలీల లభ్యత కష్టమవడంతోపాటు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుండడంతో ఈ పద్ధతిపై ఆసక్తి చూపుతున్నారు.
పొలాన్ని దమ్ము చేసి, చదును చేయాలి. చదును చేయడానికి వీలు లేనప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాల్వలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎకరాకు 12-15 కిలోల విత్తనాలు సరిపోతాయి. నారు పోయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. డ్రమ్ సీడర్ పరికరంలోని 4 డ్రమ్ముల్లో మొలకెత్తిన విత్తనాన్ని ఒక్కో డ్రమ్ముకు 3/4 వంతు నింపాలి. ముగ్గురు కూలీలు రెండు గంటల్లో ఎకరం విత్తుతారు. విత్తనాన్ని వరుసలో వేయడానికి 8 సార్లు డ్రమ్ సీడర్ను ఉపయోగించాలి. ఈ పరికరంలో వరుసల మధ్య 8 అంగుళాలు, మొక్కకు మొక్కకు మధ్య 2-3 అంగుళాల దూరం పడేలా విత్తుకోవచ్చు. విత్తిన తర్వాత బూటాక్లోర్ కలుపు మందును పొలంలో చల్లాలి. అవసరమైతే విత్తిన 30-40రోజల తర్వాత 2,4-డి సోడియం లవణాన్ని పిచికారీ చేయడం వల్ల కలుపును నిర్మూలించవచ్చు. ఈ పద్ధతిలో భాగంగా కోనోవీడర్ సహాయంతో కలుపు తొక్కించాలి.
విత్తనం పొలంలో విత్తిన తర్వాత నీరు పూర్తిగా తీసివేయాలి. మరల 3వ రోజు పలుచగా నీరు పెట్టి వెంటనే తీసివేయాలి. ఈవిధంగా మొక్కల మొదటి ఆకు పూర్తిగా వచ్చి విచ్చుకునే వరకు 7-10 రోజుల వరకు వరి పంటకు ఆరు తడులు అవసరం. ఆ తర్వాత పొలాల్లో నీరు పల్చగా ఉంచాలి. వరి పొట్ట దశ నుంచి పంట కోసే 10 రోజుల ముందు వరకు రెండు అంగుళాల నీరు నిల్వ ఉండేలా రైతులు చూసుకోవాల్సి ఉంటుంది.
నేరుగా గింజలను విత్తడం ద్వారా కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. డ్రమ్ సీడర్తో విత్తిన 3-5 రోజుల లోపు ప్రీతిలకోర్, సేప నారు ఎకరాకు 300 మిల్లీ లీటర్లు పిచికారీ చేసి ఒక రోజు ఆగి పొలాల్లో నీరు పెట్టాలి. విత్తిన 20-25 రోజులకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటే ఫినాక్లాప్రాప్ ఇథైల్ (విప్ సూపర్), ఇథాక్స్ సలురాన్ 50గ్రాముల మందు పొలంలో నీరు తీసి పిచికారీ చేయాలి. గడ్డిజాతి కలుపు మొక్కలు ఉంటే బిస్ పైరిబాక్ సోడియం(నామినీగోల్డ్)ను ఎకరాకు 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
డ్రమ్ సీడర్ వరి సాగుపై రైతులు ఆసక్తి చూపాలి. ఈ విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చు. కూలీలు, పెట్టుబడుల ఖర్చులు చాలా తక్కువ. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు మార్పు చెందాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో అధునాతన పరికరాలు ఉపయోగించి సాగు చేయాలి.
– కృష్ణకుమార్, మండల
వ్యవసాయ అధికారి, నర్సంపేట
డ్రమ్ సీడర్ వరి సాగుతో ఎకరాకు 45-50 బస్తాల దిగుబడి సాధించవచ్చు. ఎకరాకు 15 కిలోల విత్తనాలు మాత్రమే అవసరం ఉంటుంది. వరి సాగులో రైతులు నూతన పద్ధతులు పాటించాలి. డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి.
– మెండు అశోక్, వ్యవసాయ విస్తరణ అధికారి, నర్సంపేట