ఆకేరు వాగుపై నిర్మించిన ఉప్పుగల్లు రిజర్వాయర్‌తో రైతుల కలలు సాకారమవుతున్నాయి. దీంతో మూడు నియోజకవర్గాల్లోని సాగు భూములు సస్యశ్యామలం కానున్నాయి. పనులు పూర్తి కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు మత్తడి దుంకుతున్నది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలతో ఉప్పుగల్లును నింపనున్నారు. ఇక్కడి నుంచి పాలకుర్తిలో నిర్మించనున్న రిజర్వాయర్‌కు నీటిని తరలిం చేందుకు 22 కిలోమీటర్ల పొడవుతో చేపట్టిన గ్రావిటీ కెనాల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా 55 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ భూములకు సాగు నీటికి ఢోకా లేదని ఈ ప్రాంత అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
– జఫర్‌గఢ్, జూలై 31
బీడు భూములకు సాగునీరందించేందుకు ఉద్దేశించిన ఉప్పుగల్లు రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో సుమారు 55 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూ పొందించింది. జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లులోని ఆకేరు వాగుపై రిజర్వాయర్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 221 కోట్లు వెచ్చించింది.
స్టేషన్‌ఘన్‌ఫూర్, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయనున్న ఉప్పుగల్లు రిజర్వాయర్ పనులను 2016 జూలై 27న అప్పటి మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రారంభించారు. జే చొక్కారావు(దేవాదుల) ఎత్తిపోతల పథకంలో భాగంగా 0.35 టీఎంసీల సామర్థ్యంతో చిల్పూరు, జఫర్‌గఢ్ మండలాల సరిహద్దులోని ఆకేరు వాగుపై రూ. 29 కోట్లతో నిర్మించిన 2.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఆనకట్ట పనులు పూర్తయ్యాయి. మరో వైపు 250 మీటర్ల పొడవుతో సిమెంట్ కాంక్రీట్‌తో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టామని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
ఇక్కడి నుంచి పాలకుర్తిలో నిర్మించనున్న రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు 22 కిలో మీటర్ల పొడవుతో కాల్వ తవ్వకం పనులు చేపట్టారు. ఇందుకు అవసరమైన 350 ఎకరాల భూ సేకరణ పూర్తయింది. ప్రధాన కాల్వకు ఆరు సబ్ చానళ్లను నిర్మిస్తున్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి కాల్వ ద్వారా ఉప్పుగల్లు రిజర్వాయర్‌కు నీరందేలా పనులు చేపట్టారు. ఇక్కడి నుంచి పాలకుర్తి రిజర్వాయర్‌కు గ్రావిటీ కెనాల్ ద్వారా గోదావరి జలాలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్ట్ పూర్తయితే రెండు పంటలకు నీరందనుంది.
ఉప్పుగల్లు నుంచి పాలకుర్తి వరకు 21.850 కి.మీ పొడవుతో రూ. 270 కోట్లతో నిర్మించనున్న కెనాల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి(ఐ), కోనాయిచలం, తిమ్మంపేట, తిమ్మాపూర్, తమ్మడపల్లి(జి), పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామాల మీదుగా పాలకుర్తికి కాల్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఇందు కోసం 350 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించి, వారికి నష్టపరిహారం చెల్లించారు. కెనాల్ ద్వారా సమీపంలోని దిగువ గ్రామాలకు సాగు నీటిని అందించ డానికి ఉప్పుగల్లు రిజర్వాయర్ మెయిన్ కెనాల్‌కు ఆరు చోట్ల చిన్న కాల్వలను నిర్మించనున్నారు. దీంతో ప్రతి గ్రామానికి సాగు నీరు అందనుంది. తమ్మడపల్లి(ఐ) గ్రామం వద్ద రెండు సబ్ కెనాల్స్, రేగడితండా వద్ద ఒకటి, శంకర్‌తండా వద్ద ఒకటి , తమ్మడపల్లి(జి) వద్ద రెండు కెనాల్స్‌ను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన కాల్వల నిర్మాణాలు నిర్మాణం పూర్తయితే పాలకుర్తి, కొడకండ్ల, పెద్దవంగర, రాయపర్తి, వర్ధన్నపేట మండలాలకు వరద కాల్వ ద్వారా సాగు నీటిని అందించనున్నారు.
జే చొక్కారావు దేవాదుల ఎత్తి పోతల పథకం ఫేజ్ త్రీ ప్యాకేజ్ ఆరులో భాగంగా చిల్పూరు మండలంలోని నష్కల్, జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామాల మధ్య ఆకేరు వాగుపై నిర్మించిన రిజర్వా యర్ పనులు పూర్తయి ఇటీవల కురిసిన వర్షాలకు మత్తడి పోసింది. రిజర్వాయర్ నిండడంతో ఈ ప్రాంతంలో మూడు పంటలు పంటే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నష్కల్ గ్రామంలో ఆకేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంతోపాటు మండలంలోని ఉప్పుగల్లు, కూనూరు, కోనాయిచలం, తిడుగు గ్రామాల్లో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి.
ఉప్పుగల్లు రిజర్వాయర్ ద్వారా 55 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల పథకం ప్యాకేజీ 45లో భాగంగా జఫర్‌గఢ్ మండలంలోని రఘునాథపల్లి గ్రామంలో నిర్మించిన నార్త్ సైడ్ ప్రధాన కెనాల్ ద్వారా వచ్చే నీళ్లతో ఉప్పుగల్లు రిజర్వాయర్‌ను నింపనున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి పాలకుర్తిలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌కు నీటిని తరలించనున్నారు.
ఉప్పుగల్లు రిజర్వాయర్‌తో జఫర్గఢ్తోపాటు ఇతర మండలాల్లోని రైతుల కల సాకారమవుతుంది. సాగునీటికి ఇబ్బందులు లేకుండా రెండు పంటలను పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రిజర్వాయర్‌కు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు రాజయ్య, రమేశ్‌కు కృతజ్ఞతలు.
-రడపాక సుదర్శన్, ఎంపీపీ, జఫర్‌గఢ్
ఉప్పుగల్లు రిజర్వాయర్‌తో భూగర్భ జలాలు పెద్ద ఎత్తున పెరుగుతాయి. దీంతో రైతులు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రెండు పంటలు పండించుకుంటారు. సాగునీటి కష్టాలు తీరి రైతులు సంతోషంగా ఉంటారు.
– ఆర్. భాస్కర్, రైతు, కోనాయిచలం