బృహత్ పల్లె ప్రకృతి వనాలు చిట్టడవులుగా తయారవుతున్నాయి. పల్లెల్లో పచ్చదనం పంచుతున్నాయి. ప్రజలకు ఆహ్లాదాన్నిస్తున్నాయి. ప్రతి బీపీపీవీలో వేలాది మొక్కలు పెరుగుతున్నాయి. పచ్చదనం పెంపు కోసం తొలి విడుత గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుతలో మండలానికో బీపీపీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రతి మండలంలో ఏదేని గ్రామంలో పదెకరాల ప్రభుత్వ స్థలంలో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో నాటాల్సిన మొక్కలు, రహదారుల నిర్మాణం, ఇతర వసతుల కల్పనపై మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ క్రమంలో గత ఏడాది అధికారులు ప్రతి మండలంలో బీపీపీవీ ఏర్పాటు కోసం ఒకేచోట పది ఎకరాలు ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ఇప్పటికే 11మండలాల్లో పనులు ప్రారంభించారు. ప్రతి బృహత్ పల్లె ప్రకృతి వనంలో నాలుగు ఎకరాలతో కూడిన రెండు బ్లాకులను రూపొందించి ఎకరానికి 4 వేల చొప్పున 8 ఎకరాల్లో 32 వేల మొక్కలు నాటారు.
వరంగల్, జూలై 31(నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. అలాగే, ప్రతి మండలంలో ఒకేచోట పది ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నది. జిల్లాలోని చెన్నారావుపేటలో కోనాపూర్, దుగ్గొండిలో కేశవపురం, గీసుగొండలో వంచనగిరి, ఖానాపురంలో కీర్యతండా, నల్లబెల్లిలో కొండాపూర్, నర్సంపేటలో రాజుపల్లి, నెక్కొండలో బొల్లికొండ, పర్వతగిరిలో కొంకపాక, రాయపర్తిలో రాయపర్తి, సంగెంలో తిమ్మాపూర్, వర్ధన్నపేటలో ఉప్పరపల్లి గ్రామం వద్ద బీపీపీవీల ఏర్పాటు పనులు చేపట్టారు.
ఈ పదకొండు గ్రామాల వద్ద గుర్తించిన పదేసి ఎకరాల ప్రభుత్వ స్థలంలో బ్లాక్‌లను తయారు చేశారు. ప్రతి బీపీపీవీలో నాలుగు ఎకరాలతో కూడిన రెండు బ్లాకులను రూపొందించి ప్రతి బ్లాక్‌లో ఎకరానికి 4 వేల చొప్పున 8 ఎకరాల్లో 32 వేల మొక్కలు నాటారు. మిగతా రెండు ఎకరాల్లో మొక్కల బ్లాకుల మధ్య రహదారులు నిర్మించారు. ఆట స్థలం కూడా కేటాయించారు. మీటరుకు ఒకటి ఉండేలా ఎనిమిది ఎకరాల్లో మొత్తం 32 వేలూ అటవీజాతి మొక్కలు నాటారు. కోనాపూర్, కేశవపురం మినహా ఇతర బీపీపీవీల పనులు పూర్తయినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఈ తొమ్మిదింటిలో 2021-22లో నాటిన మొక్కల్లో ప్రస్తుతం 1,13,943 మొక్కలు పెరుగుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రాజుపల్లిలో 800, బొల్లికొండలో 8 వేలు, కొంకపాకలో 1,500 మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. పనులు కొనసాగుతున్న కోనాపూర్ బీపీపీవీలో గత ఏడాది 100, ఈ ఏడాది 100, కేశవాపురం బీపీపీవీలో ఈ ఏడాది 2 వేల మొక్కలు నాటినట్లు నివేదికలో తెలిపారు. గత ఏడాది నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో బీపీపీవీలు మినీ ఫారెస్టులను తలపిస్తున్నాయి.
కొండాపూర్‌తో పాటు మరికొన్ని బీపీపీవీల్లో నాటిన మొక్కల్లో పండ్ల, పూల మొక్కలు కూడా ఉన్నాయి. స్థానికులు వీటిని సందర్శించి ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ఈ చిట్టడవుల్లో గ్రీనరీని ఆస్వాదిస్తున్నారు. పండ్ల మొక్కలు నాటిన బీపీపీవీల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరనుంది. త్వరలో చెట్ల నుంచి పండ్లు కోసి మార్కెట్లో విక్రయించే అవకాశం ఉంది.
ప్రతి మండలంలో అదనంగా మరో నాలుగు బీపీపీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ ఏడాది నిర్ణయించింది. ఒకేచోట పది ఎకరాల స్థలం సేకరించడం సమస్యగా మారినందున అదనపు బీపీపీవీలను ఐదేసి ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు ప్రతి మండలంలో అదనంగా నాలుగు చొప్పున జిల్లాలో 44 బీపీపీవీల ఏర్పాటు కోసం ఒకేచోట ఐదేసి ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో ఉన్నారు.
ఇప్పటివరకు గీసుగొండ మండలంలోని బొడ్డుచింతలపల్లి, శాయంపేట, కొనాయిమాకుల, ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్, చెన్నారావుపేట మండలంలో లింగగిరి, చెన్నారావుపేట, నెక్కొండ మండలంలో నాగారం, పర్వతగిరి మండలంలో కొంకపాక, సంగెం మండలం రామచంద్రపురం, సంగెం, రాయపర్తి మండలం గన్నారం, తిర్మలాయపాలెం, ఆరెగూడెం, వెంకటేశ్వర్లపల్లి, వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామాల వద్ద ఐదేసి ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పనులు చేపట్టారు. ఈ పదిహేను బీపీపీవీల్లో మొక్కలు నాటేందుకు భూమిని లెవలింగ్ చేస్తున్నారు.
దమ్మన్నపేట బీపీపీవీలో ఇటీవల 100 మొక్కలు కూడా నాటారు. మిగతా 29 అదనపు బీపీపీవీల ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాల సేకరణ కొనసాగుతున్నది. ప్రతి అదనపు బీపీపీవీలో ఎకరానికి 4 వేల చొప్పున 4 ఎకరాల్లో 16 వేల మొక్కలు నాటి మిగతా స్థలంలో రహదారులు నిర్మించే దిశగా అధికారులు ముందుకు వెళ్తున్నారు. వీటి ఏర్పాటుతో జిల్లాలో మొత్తం బీపీపీవీల సంఖ్య 55కు చేరనుంది. కాగా, జిల్లాలో బీపీపీవీల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సంపత్‌రావు వెల్లడించారు. ఇటీవల విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున బీపీపీవీల్లో మొక్కలు నాటడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.