తొర్రూరు, జూలై 30 : పల్లె పల్లెనా ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ నిరంతర సేవలు అందిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు.
ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో 90 రోజుల పాటు ఉద్యోగార్థులకు నిర్వహించిన ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం శనివారం రామ ఉపేందర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో 40 నుంచి 50 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా చేయూతనందిస్తానని చెప్పారు. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వందలాది మంది యువకులకు హోంగార్డులు, ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లుగా అవకాశం కల్పించి అండగా ఉన్నట్లు తెలిపారు.
గత సంవత్సరం ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తొర్రూరు, పాలకుర్తి కేంద్రాల్లో ఇచ్చిన శిక్షణతో 350 మంది ఉద్యోగాలు సాధించడం ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఈ ఏడాది కూడా ఈ రెండు ప్రాంతాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెట్‌తోపాటు గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల కోసం 90 రోజుల పాటు శిక్షణ తరగతులను కొనసాగించామని, టెట్‌లో 90శాతం మంది అర్హత సాధించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే తల్లిదండ్రుల కలలు నెరవేరడంతోపాటు కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని, ఈ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన వారికి ఎలాంటి అవసరమొచ్చినా తనను సంప్రదిస్తే అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.
35 ఏళ్లుగా ప్రజాసేవలో అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నానని, ఇక నిరుద్యోగులకు కొలువులు ఇప్పించడం కోసమే తన కారాఇ్యచరణ కొనసాగుతుందన్నారు. అనంతరం తొర్రూరు, పాలకుర్తి శిక్షణా కేంద్రాల్లో సమర్థవంతంగా తరగతులు నిర్వహించిన వారందరినీ అభినందించి సత్కరించారు.
శిక్షణ తరగతుల పర్యవేక్షకురాలు పంజా కల్పన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పీ సంపత్‌రెడ్డి, తొర్రూరు ఆర్డీవో ఎల్ రమేశ్, డీఎస్పీ రఘు, అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ సెక్రటరీ అరూరి విశాల్, వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ టీ రవీంద్ర, ప్రముఖ మనోవిసాక నిపుణడు గూడెల్లి శివప్రసాద్, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాల ఎంపీపీలు తూర్పాటి చిన్న అంజయ్య, ఈదురు రాజేశ్వరి, అనిమిరెడ్డి, తొర్రూరు జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ వీ రామచంద్రయ్యశర్మ, తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కమిషన్ డైరెక్టర్ ఎల్ వెంకటనారాయణగౌడ్, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్ఱెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, మండల అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, ఐలయ్య, నవీన్, రామిని శ్రీనివాస్, నాయకులు మేడారపు సుధాకర్, శ్రీరాం సుధీర్, జయశంకర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు సత్యనారాయణాచారి, శిక్షణ తరగతుల సహాయకులు పాలిశెట్టి శ్రీనివాస్, ఎర్రం రాజు, టీఆర్ఎస్ యూత్ ప్రతినిధులు ముద్దసాని సురేశ్, మురళీయాదవ్ పాల్గొన్నారు.