అబద్ధాలనే అస్త్రంగా చేసుకొని ప్రజలను రెచ్చగొట్టి.. పార్టీని బలోపేతం చేసుకునేందుకు ‘ప్రజాగోస’ పేరిట బీజేపీ చేపట్టిన కార్యక్రమం క్షేత్ర స్థాయిలో అబాసు పాలవుతున్నది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని నర్సంపేటలో తొలివిడుత యాత్ర లీడర్లు.. క్యాడరు కరువై బతిలాడినా ఒక్కరూ రాక నవ్వులపాలవుతున్నది. పైగా ఈ కార్యక్రమం పార్టీలో అంతర్గతంగా ఉన్న గ్రూపుల లొల్లిని బట్టబయలు చేయడంతో పాటు కొత్త, పాత నేతల మధ్య అంతరాన్ని ఇంకా పెంచుతున్నది. నిన్నమొన్న చేరిన వారికి యాత్రలో ప్రాధాన్యత ఇస్తుండడం సీనియర్లకు మింగుడుపడకుండా చేస్తున్నది. ‘తీరం లేని సంద్రంలో తెడ్డు లేని నావ’లా తమ పార్టీ పరిస్థితి తయారైందని ఉన్న కొద్దిపాటి శ్రేణుల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది.
వరంగల్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారతీయ జనతాపార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాగోస కార్యక్రమం జనం లేకుండా సాగుతున్నది. రెచ్చగొట్టడం లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు దూరంగా ఉంటున్నారు. గ్రామాల్లోనూ స్పందన అసలే కనిపించడం లేదు. లీడర్లు, క్యాడర్లు లేకపోవడంతో చాలా గ్రామాల్లో ఎలాంటి హడావుడి లేకుండానే మొక్కుబడిగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఎంతమంది హాజరైనా ప్రజలు మాత్రం యాత్ర వైపు చూడడం లేదు. కమలం పార్టీ నాయకులు ఎంత బతిమిలాడినా యాత్ర జరిగే రూట్లలో ఏ ఒక్కరూ రావడంలేదు. బీజేపీ కార్యక్రమాన్ని పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతున్నారు.
అభివృద్ధి, సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను… కేంద్రంలోని బీజేపీ పాలన తీరును పోల్చుకుంటున్నారు. తమ ఊర్ల మీదుగా బీజేపీ యాత్ర సాగినా దానికి దూరంగానే ఉంటున్నారు. డీజిల్, ఎరువుల ధరల పెంపుతో పెట్టుబడి ఖర్చులు పెరిగిన తీరుపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. వంట గ్యాస్, జీఎస్టీ పేరుతో అన్ని సరుకుల ధరలను నిరంతరం పెంచుతుండడంపై మధ్య తరగతి, పేదల వర్గాలు బీజేపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలలో బీజేపీ పరిపాలనపై ఉన్న నిరసనను తప్పించుకునేందుకు ఆ పార్టీ నాయకులు సైతం సాధారణ ప్రజలు లేకుండానే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
రెచ్చగొట్టే వాదనలు, అబద్ధాలను ప్రచారం చేయడం అలవాటైన బీజేపీ మన రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమాన్ని తీవ్రం చేసే పనిలో నిమగ్నమైంది. ప్రజా గోస పేరిట అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ సెగ్మెంట్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. తొలిదశలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రారంభించింది. ఈ నెల 21 నుంచి ఆగస్టు 1 వరకు పది రోజుల పాటు ఈ యాత్ర నిర్వహిస్తున్నది.
మోటరు సైకిల్ ర్యాలీలు, గ్రామాల్లో సభలు నిర్వహించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లోని నర్సంపేటలో దీన్ని చేపట్టారు. టీఆర్ఎస్కు గట్టి పట్టున్న ఈ సెగ్మెంట్లో బీజేపీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయమే ఎవరికీ తెలియకుండా పోతున్నది. బీజేపీ కార్యక్రమం ఇన్చార్జిగా ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్యక్రమం ముగింపునకు వచ్చింది. నర్సంపేట సెగ్మెంట్లో ఎక్కడా బీజేపీకి స్పందన కనిపించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తప్పుబట్టే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ వారు ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి ఉంటున్నది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేపట్టిన ఈ యాత్రపై ఆ పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో అసలే ఉనికి లేని చోట్ల ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సరికాదని కమలం పార్టీ కార్యకర్తలు అంటున్నారు.
బీజేపీ చేపట్టిన ప్రజాగోస కార్యక్రమం ఆ పార్టీలో అంతర్గతంగా ఉన్న గ్రూపుల లొల్లిని బహిర్గతం చేస్తున్నది. వివిధ పార్టీలలో ఆదరణలేని నేతలు పలువురు బీజేపీలో చేరడంతో… కొత్తగా చేరిన వారికి, పాత వారికి మధ్య అంతరం బాగా పెరుగుతున్నది. ఇన్నేండ్లుగా పార్టీ కోసం పని చేసిన తమను పట్టించుకోకుండా మొన్నమొన్న చేరిన వారికి కార్యక్రమంలో ప్రాధాన్యత ఇస్తుండడంపై బీజేపీ శ్రేణులు రగిలిపోతున్నాయి.
రాష్ట్ర నాయకత్వం కూడా కొత్త వారికి కార్యక్రమాల బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గొప్పగా చెప్పుకుని చేపట్టిన ప్రజాగోస కార్యక్రమంలో ఆ పార్టీ అసలైన కార్యకర్తలకు స్థానం లేకుండా పోతున్నదని అంటున్నారు.
ప్రస్తుతం యాత్ర జరుగుతున్న బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, నర్సంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జిగా చెప్పుకుంటున్న రేవూరి ప్రకాశ్‌రెడ్డితోపాటు కార్యక్రమంలో పాల్గొంటున్న మరో ఇద్దరుముగ్గురు మండల స్థాయి నాయకులు కొత్తగా పార్టీలో చేరిన వారేనని.. మొదటి నుంచి పార్టీలో ఉన్న ఒక్క నాయకుడు, కార్యకర్త ఆ కార్యక్రమంలో కీలకంగా లేరని వాపోతున్నారు. పార్టీ బలోపేతం కోసం బీజేపీ చేపట్టిన యాత్ర కార్యక్రమం ఇప్పుడు కార్యకర్తల అసంతృప్తితో అసలుకే మోసం తెచ్చేలా కనిపిస్తున్నది.