ఏలుబడిలో వారి సామంతులు నతవాడీ వంశస్తుల రాజధానిగా విలసిల్లిన ఇనుగుర్తికి ఘనమైన చరిత్ర ఉన్నది. ఊరిచుట్టూ కాకతీయులు నిర్మించిన చెరువులు, ఎటుచూసినా అద్భుత శిల్పకళా సంపదతో ఈ గ్రామం చారిత్రక విశిష్టతను చాటుతున్నది. 1985లోనే మండల కేంద్రంగా ఎంపికైనా చివరి నిమిషంలో అవకాశం కోల్పోయి, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో తిరిగి హోదా దక్కించుకున్నది. ఇనుగుర్తిని మండల కేంద్రంగా గుర్తిస్తూ మంగళవారమే జీవో విడుదల కాగా, 37 ఏళ్ల తమ నిరీక్షణ ఫలించినందుకు గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
కేసముద్రం, జూలై 26 : మహబూబాబాద్ జిల్లాలో 18వ మండలంగా అవతరించిన ఇనుగుర్తి, ఎంతో చారిత్రక విశేషాలను కలిగిఉన్నది. కాకతీయులకు సామంతులుగా ఉన్న నతవాడీ వంశస్తుల రాజధానిగా ఇనుగుర్తి అలరారింది. నాటి ఘన చరితకు ఇక్కడ ఎన్నో సాక్ష్యాలున్నా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఊరు వెలుగులోకి రాకుండా పోయింది.
12వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యంలో సామంత రాజులైన నతవాడీ వంశస్తులు ఇనుగుర్తి కేంద్రంగా పాలన కొనసాగించారు. గ్రామం చుట్టూ కాకతీయులు నిర్మించిన ఏడు చెరువులు ఇప్పటికీ ఇక్కడి ప్రజలకు జీవనాధారంగా నిలిచాయి. కాకతీయుల నాటి నిర్మాణాలు, శిల్పాలు ఊరిలో ఎక్కడ పడితే అక్కడే దర్శనమిస్తాయి. వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయాలకు ఉపయోగించిన రాళ్లతో చేసిన శిల్పాలు ఇక్కడ ఉన్నా ప్రస్తుతం ధ్వంసమై ఆదరణకు నోచుకోకుండా పడి ఉన్నాయి. గ్రామంలో గుట్ట పైన, కింద ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు భక్తుల కొంగుబంగారంలా పేరుగాంచాయి.
1206లోనే కాకతీయులు ఇక్కడ శివాలయం, లక్ష్మీనరసింహస్వామి, ఉమారామలింగేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలను కట్టించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. కాకతీయులు మెచరాజుపల్లి గ్రామానికి వెళ్లేదారిలో కట్టిన గుంటి చెరువులో నిర్మించిన ఉయ్యాల ఇప్పటికీ కనువిందు చేస్తుంది. చెరువు పక్కనే ఓ వైపు లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మరోవైపు యాదవరాజుల నిలువెత్తు విగ్రహాలు ఉన్నాయి. ఈ వంశీయులు 1104 నుంచి 1269 వరకు పాలించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది.
వీరి శాసనాలను నిడిగొండ, కుందవరం, నర్సంపేట, త్రిపురాంతకం, బయ్యారం, ద్రాక్షారామం, సింహాచలం ప్రాంతాల్లో చరిత్రకారులు గుర్తించారు. ఇనుగుర్తిలో కాకతీయ ప్రోలరాజు 1117లో తవ్వించిన గుంటి చెరువు వద్ద అద్భుత శిల్ప సంపద ఇప్పటికీ అలరారుతున్నది. వరంగల్‌లోని గుంటి చెరువులో నిమ్మకాయ వేస్తే గొలుసుకట్టు వ్యవస్థ ద్వారా ఇనుగుర్తి గుంటి చెరువులో తేలేదని పూర్వీకులు చెబుతున్నారు.
1952లో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణంలో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో చాలా శిల్పాలు బయట పడ్డా యి. కాకతీయుల కాలం నాటి నంది విగ్రహాన్ని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు, నంది, నాగేంద్రుడు, ఎత్తయిన యాదవరాజుల విగ్రహాలు, శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి.
ఇనుగుర్తికి చెందిన వద్దిరాజు సోదరులు రాఘవరంగారావు, సీతారామచందర్‌రావు 1922లోనే ఇక్కడి నుంచి తెలుగు తొలి దినపత్రికను ప్రారంభించారు. వీరు సైకిల్‌పై ఇతర పాంత్రాలకు వెళ్లి పత్రికలు పంచేవారు. ఇనుగుర్తి గ్రామం వాలీబాల్‌కు కేరాఫ్‌గా పేరుగాంచింది. గ్రామానికి చెందిన కన్న వెంకటనారాయణ ఇండియన్ వాలీబాల్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఎంతోమంది క్రీడాకారులు వాలీబాల్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన వద్దిరాజు నారాయణ ఊరిలో 1969లోనే రైస్‌మిల్లు ఏర్పాటు చేశారు. ఆయన కొడుకులు కిషన్, దేవేందర్, రవిచంద్ర, వెంకటేశ్వర్లు తండ్రి స్థాపించిన మిల్లులో వ్యాపార మెళకువలు నేర్చుకొని గ్రానైట్ రంగంలోకి అడుగుపెట్టారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో క్వారీ, గ్రానైట్ పరిశ్రమలను నెలకొల్పి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గాయత్రి గ్రానైట్ కంపెనీల ద్వారా వద్దిరాజు రవిచంద్ర, గాయత్రి రవిగా గుర్తింపుపొందారు. వ్యాపారంతో పాటు ప్రజా సేవలో తలమునకలైన గాయత్రి రవి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత మండలాలను ఏర్పాటు చేశారు. కాకతీయులు పాలించిన ఇనుగుర్తి అధిక జనాభా కలిగి ఉండడంతో మండల కేంద్రానికి ఎంపికైంది. చివరి నిమిషంలో అవకాశం కోల్పోయింది. నాటి నుంచి ఇనుగుర్తి మండలకేంద్రం కావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. నాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ కోరిక ఇన్నాళ్లూ నెరవేరలేదు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పరిపాలనలో సంస్కరణలు చేశారు. ఇందులో భాగంగానే కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో 2016 అక్టోబర్‌లో మహబూబాబాద్ జిల్లాకేంద్రంగా అవతరించిన సందర్భంలోనే ఇనుగుర్తి మండలకేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమైనా సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. 1985లో ఒకసారి, 2016లో మరోసారి ఏర్పాటైనట్లే అయ్యి చివరకు రద్దు కావడంతో ప్రజల్లో మరింత పట్టుదల పెరిగి పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇనుగుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక్కడి ప్రజల 37 ఏండ్ల ఆకాంక్ష నెరవేరింది.
ఇనుగుర్తిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల కళాశాల, బాలుర వసతి గృహం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, పశువైద్య శిబిరం, సబ్ పోస్టాఫీస్, సబ్‌స్టేషన్, పెట్రోల్ బంక్, అటవీ శాఖ కార్యాలయం, ఐకేపీ భవనం, రైతు వేదిక ఉన్నాయి. ఇప్పుడు మండల కేంద్రంగా అవతరించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానున్నాయి. ఇనుగుర్తి, అయ్యగారిపల్లి, చీన్యాతండా, లాలుతండా, కోమటిపల్లి, తార్సింగ్తండా, పాతతండా, నెల్లికుదరు మండలంలోని చిన్ననాగారం, మీట్యాతండా, రాజులకొత్తపల్లి, సీతారాంపురం, చిన్నముప్పారం, పెద్దతండా, లక్ష్మీపురం గ్రామాలతో జిల్లాలో ఇనుగుర్తి 18వ మండలంగా అవతరించింది.
ఇనుగుర్తి మండల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో విడుదల చేయడంతో మంగళవారం గ్రామంలో సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంపిణీ చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దార్ల రామ్మూర్తి, టీఆర్ఎస్ నాయకుడు, గాయత్రి గ్రానైట్ అధినేత వద్దిరాజు కిషన్, పార్టీ నాయకులు మాలోత్ మంగ్యానాయక్, పింగిళి శ్రీనివాస్, సట్ల భిక్షపతి, దార్ల భాస్కర్ ఉన్నారు.
ఇనుగుర్తి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు గ్రామస్తులమంతా రుణపడి ఉంటాం. ఇనుగుర్తిని మండలకేంద్రం చేయాలని కోరినా గత పాలకులు పట్టించుకోలేదు. ఇక్కడి ప్రజల అభీష్టం మేరకు సీఎం కేసీఆర్ ఇనుగుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.
– దార్ల రాంమూర్తి, సర్పంచ్
శతాబ్దాల చరిత్ర కలిగిన ఇనుగుర్తి మండల కేంద్రం కావడం ఆలస్యమైనా సీఎం కేసీఆర్ చొరవతో మా ఆకాంక్ష నెరవేరింది. ఎన్టీఆర్ హయాంలోనే మండల కేంద్రం కావాల్సి ఉండే. నాటి పాలకుల నిర్లక్ష్యం వల్లే కాలేదు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో చరిత్ర కలిగిన ఇనుగుర్తి మరో చరిత్రను నమోదు చేసుకున్నట్లయింది. ఇనుగుర్తి మండల ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
– పింగిళి శ్రీనివాస్, ఇనుగుర్తి
కొత్త మండలం ఇనుగుర్తిని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలి. కొన్ని గ్రామాల ప్రజల్లో ఉన్న బేదాభిప్రాయాలను ఇనుగుర్తి గ్రామ నాయకులు, ప్రజలు తొలగించాలి. అన్ని గ్రామాల వారిని కలుపుకొని పోతూ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చెందాలి. ఇనుగుర్తి మండల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ కాల్వలు, ఇతర మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేస్తా. ఇనుగుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్‌కు, సహకరించిన మంత్రి దయాకర్‌రావుకు కృతజ్ఞతలు.
– వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు