మహబూబాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ‘బీజేపీ దిగజారుడు రాజకీయాలకు తెరలేపింది.. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది.. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ బీజేపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జడ్పీచైర్‌పర్సన్ బిందుతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జాతీయ సమావేశాల పేరిట బీజేపీ శ్రేణులు తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతూ టీఆర్ఎస్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకులకు సిగ్గు, లజ్జ ఉంటే విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చిల్లర మాటలు మాట్లాడి ఏం దండుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ 100 స్థానాల్లో మూడో స్థానానికే పరిమితమవడం ఖాయమన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందన్నారు. టీఆర్ఎస్ నాయకుల జోలికొస్తే ఇక నుంచి ఊరుకునేది లేదు.. మేం తలుచుకుంటే మీరు రోడ్ల పడుతరు.. ఖబడ్దార్ అని మంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎంత కసితో ఉందో మరోమారు రుజువైందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ నాయకులను రెచ్చగొట్టి, మాట్లాడిచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. ‘మేము తన్నదలుచుకుంటే మీ వీపులు విమాన మోత మోగుతాయి.. ఉద్యమంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న మాకు బీజేపీ నాయకులను ఎదుర్కోవడం పెద్ద లెక్కకాదు.. ఉడుత ఊపులు, తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ నాయకులు భయపడుతారనుకుంటే అది మీ భ్రమే తప్ప వేరేది కాదు’ అని అన్నారు. గాంధేయమార్గంలో నడుస్తున్న మమ్ముల్ని రెచ్చగొడితే ఏమైనా చేయగలిగే శక్తి మాకుందన్నారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకుడు హుస్సేన్‌నాయక్ సీఎంకేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. బీజేపీ నాయకులు చప్పట్లు కొడుతున్నారు కదా అని రెచ్చిపోయి పూనకం వచ్చినట్లు మాట్లాడాడు. ఇప్పటికైనా భాష మార్చుకోకుంటే తమదైన శైలిలో బుద్ధి చెబుతామన్నారు. ‘వలస వచ్చిన బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీని పీకేదేమీ లేదన్నారు. ఎవరెన్ని కుప్పి గంతులేసినా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ‘నేను నోరుతెరవడం ప్రారంభిస్తే బీజేపీ నాయకులు జిల్లాలో ఒక్కడు కూడా ఉండకుండా పోతారు..నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, మార్నేని వెంకన్న, గోగుల రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.