రాష్ట్రంలో గుడుంబా నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎక్సైజ్‌శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గుడుంబా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అందులో స్పష్టం చేసింది. ఈ క్రమంలో సంబంధిత అధికారులు తయారీ, రవాణా, అమ్మకందారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాసిల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాతో పాటు పీడీ యాక్టు ప్రయోగిస్తున్నారు. గుడుంబా తయారీకి బెల్లం సరఫరా చేస్తున్న వ్యాపారులపైనా కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల వరంగల్ బీట్బజార్లోని బెల్లం దుకాణాలనూ మూసివేశారు. బెల్లం విక్రయించొద్దని ఇక్కడి వ్యాపారుల సిండికేట్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లో నిల్వ చేసి అమ్మకుండా నిఘా పెట్టారు.
వరంగల్, జూన్ 24(నమస్తేతెలంగాణ) : ఇటీవల సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో పోలీసు, ఎక్సైజ్‌శాఖ ఉ న్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గుడుం బా, గంజాయి, డ్రగ్స్ వినియోగంపై సమీక్ష జరిపారు. గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జరిగిన ఎక్సైజ్‌శాఖ ఉన్నతస్థాయి సమీక్షలో జిల్లాలో గుడుంబా తయారీ జోరుగా సాగుతున్నట్లు ప్రస్తావనకు వచ్చింది. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుండడంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గ్రామాల నుంచి సమాచారం సేకరించారు. గుడుంబా తయారీ కోసం రాష్ట్రం నుంచే గాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా బెల్లం పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. పాతవారితో పాటు కొత్తగా మరికొందరు ఈ దందా నిర్వహిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు.
గ్రామం వారీగా లిస్టులు సిద్ధమైన వెంటనే ఎక్సైజ్‌శాఖ అధికారులు జిల్లాలో గుడుంబా నియంత్రణకు పక్కా ప్రణాళిక తయారు చేశారు. జిల్లా సూపరింటెండెంట్ లక్ష్మానాయక్ పర్యవేక్షణలో ఇప్పటికే నెక్కొండ, రాయపర్తి, వర్ధన్నపేట, గీసుగొండ, సంగెం, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, పర్వతగిరి మండలాల్లోని గుడుంబా తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు చేశారు. గుడుంబా తయారీకి వినియోగిస్తున్న డ్రమ్ములు, ముడి సరుకులను ధ్వంసం చేశారు. గుడుంబా స్వాధీనం చేసుకుని తయారీదారులపై కేసులు నమోదు చేశారు.
తయారీకి కేరాఫ్‌గా మారిన నెక్కొండ మండలంలోని చర్లతండా, చెరువుముందుతండా, నెక్కొండతండాల్లో నిరంతరం దాడులు జరుపుతున్నారు. తయారీ, రవాణా, అమ్మకందారులను తాసిల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తున్నా రు. బైండోవర్ ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.2 లక్షల జరిమానా ప్రతిపాదిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం బైండోవర్ ఉల్లంఘించి గుడుంబా తయారు చేసిన గీసుగొండ మండలం నంద్యనాయక్తండాకు చెందిన భిక్షపతికి రూ.1.50 లక్షల జరిమానా విధించారు. ఇప్పటివరకు జిల్లాలో తాసిల్దార్లు రూ.8 లక్షల వరకు జరిమానా విధించినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. అలాగే, నెక్కొండ మండలం చర్లతండాకు చెందిన అజ్మీరా సుమన్‌పై పీడీ యాక్టు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం, ఇతర ముడి సరుకుల సరఫరాపైనా అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల రాయపర్తి మండలంలో రూట్‌మార్చ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానంతో ఒక బొలెరో వాహనాన్ని తనిఖీ చేశారు. 1,160 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. రవా ణా చేస్తున్న లకావత్‌తండా, నీలగిరిస్వామి తండాలకు చెందిన నరేశ్, రమేశ్‌తో పాటు నిజామాబాద్ జిల్లా డ్రైవర్లు రాజు, నరేశ్‌పై కేసు నమోదు చేశారు.
గుడుం బా కోసం దీన్ని సరఫరా చేస్తున్నందున నిజామాబాద్‌కు చెందిన గంగారాం ట్రేడర్స్పైనా కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఖానాపురం మండలం బుధరావుపేటలో తనిఖీలు చేసి ఓ కారులో రవాణా అవుతున్న 12 వందల కిలోల బెల్లాన్ని పట్టుకున్నారు. సిర్పూర్కాగజ్నగర్ నుంచి కారులో అరవై పెట్టెల ద్వారా ఈ బెల్లం ఇక్కడకు వచ్చినట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన రాజేశ్, ప్రకాశ్ బుధరావుపేటలోని భానుప్రసాద్‌కు ఈ బెల్లాన్ని సరఫరా చేసినట్లు తేల్చారు. వీటితో పాటు పలు గ్రామాల్లో గుడుంబా తయారీ కోసం రవాణా అవుతున్న బెల్లం, పటికను పట్టుకుని కేసులు చేశారు.
వరంగల్ బీట్బజార్లోని బెల్లం దుకాణాల ద్వారా గుడుంబా తయారీ కోసం గ్రామాలకు బెల్లం సరఫరా జరుగుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా బీట్బజార్లోని బెల్లం దుకాణాలు మూతపడ్డాయి. గతంలో బెల్లం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి బీట్‌బజార్‌లో దుకాణాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వ్యాపారులు ఇతర ప్రాంతాల్లో బెల్లం నిల్వ చేసే అవకాశం ఉందని నెట్వర్క్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ముఖ్యంగా నిరంతర దాడులతో ఆబ్కారీ అధికారులు గుడుంబా తయారీ, రవాణా, అమ్మకందారుల్లో గుబులు పుట్టిస్తున్నారు.