హనుమకొండ, జూన్ 24 : ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి కోరారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్‌కు పూర్తిగా స్వస్తి పలకాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 75 మైక్రాన్ల మందం లోపు ప్లాస్టిక్‌ను ప్రభుత్వం నిషేధించిదన్నారు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం దుకాణాల్లో 50 మైక్రాన్ల మందం కన్న తకువ గల ప్లాస్టిక్ బ్యాగులను వెంటనే గుర్తించి, తొలగించాలని డీపీవో, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
ప్రత్యామ్నాయంగా జ్యూట్, కాటన్, నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ బ్యాగులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేసి, జరిమానాలు విధించాలన్నారు. అలాగే, పారిశ్రామిక వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. జిల్లాలో దవాఖానలు, నర్సింగ్ హోమ్‌ల ద్వారా వచ్చే బయో మెడికల్ వేస్ట్‌ను దూరంగా తరలించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారికి కలెక్టర్ సూచించారు. జిల్లాలో కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వచ్చే నెల 1 నుంచి నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వాడిన వ్యక్తులకు రూ.500 నుంచి రూ.5వేల వరకు, సంస్థలకు రూ.5వేల జరిమానా విధిస్తామన్నారు. దీనిపై మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. మాల్స్, వీధి వ్యాపారులు, పండ్లు విక్రయించేవారు కూడా నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పాఠశాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు.
జిల్లాల్లోని గ్రామ పంచాయతీలు, నగర పాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా ప్రచార కార్యక్రమాలు, సూల్ పిల్లలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ గోపి అన్నారు. ఇతర సామాజిక మద్యమాలతోపాటు, గ్రామాల్లోని వార్డుల్లో బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం చేయాలన్నారు. పంచాయతీ సెక్రటరీలు, సంబంధిత శాఖల సిబ్బంది ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ఎలా రీసైక్లింగ్ చేయాలనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకట్రామ్ నర్సయ్య, వరంగల్ అదనపు కలెక్టర్, పర్యావరణ వేత్తలు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.