ములుగు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు విజయవంతమైంది. ప్రజల ఆరోగ్య వివరాల డిజిటలైజేషన్ కోసం మార్చి 5న ప్రారంభించిన సర్వే మే 31 వరకు కొనసాగింది. 92 శాతం నమోదు కాగా, బతుకుదెరువు కోసం వెళ్లి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న మిగతా వారు రాగానే వివరాలు సేకరించనున్నారు. జిల్లాలోని 15 పీహెచ్‌సీల పరిధిలో 1,01,198 గృహాలను 120 బృందాలు సందర్శించాయి. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ 18 ఏళ్లు దాటిన 1,81,655 మందికి పరీక్షలు చేసి, రక్తనమూనాలను సేకరించారు. అధునాతన టీ డయాగ్నస్టిక్ సెంటర్లో పరీక్షించి రిపోర్టులను పంపిణీ చేశారు. సర్వే మూడు పీహెచ్‌సీల్లో వంద శాతం పూర్తి కాగా, మిగతా 12 పీహెచ్‌సీల్లో 90శాతం పూర్తయ్యింది. డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య ఎప్పటికప్పుడు పరిశీలించగా, కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య క్షేత్రస్థాయిలో పరిశీలించడంతోపాటు సమీక్షలు నిర్వహిస్తూ విజయవంతానికి కృషిచేశారు.
ములుగు, జూన్ 8 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఈ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. ప్రపంచంలోని ఆగ్ర దేశాల్లో ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సిరిసిల్ల, ములుగు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. జిల్లాలోని 15 పీహెచ్‌సీల పరిధిలో 1,01,198 గృహాలను 120 వైద్య బృందాలు సందర్శించాయి. ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించారు.
18 ఏళ్లు దాటిన 1,81,655 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజల నుంచి సేకరించిన రక్తనమూనాలను అధునాతన టీ డయాగ్నస్టిక్ సెంటర్లో పరీక్షించి 1,21,336 మందికి రిపోర్టులను పంపిణీ చేశారు. మిగతా వారికి సైతం అందించనున్నారు. ఈ సర్వే మార్చి 5వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతులమీదుగా ప్రారంభమై మే 31వ తేదీ వరకు కొనసాగి 92శాతం పూర్తయ్యింది. మిగతా ఎనిమిది శాతం మంది బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నవారు. వారి ఆరోగ్య వివరాలను వైద్య సిబ్బంది చేపట్టలేకపోయారు. వారు వచ్చినప్పుడు పీహెచ్‌సీలను సందర్శిస్తే వివరాలను సేకరించి రిపోర్టులు అందించేందు కు ఏర్పాట్లు చేశారు.
ఈ హెల్త్ ప్రొఫైల్ సర్వేను సమర్థంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.ఆతర్వాత సర్వే చేపట్టగా ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు పరిశీలించారు. డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య రోజూ జిల్లాలో పర్యటిస్తూ సర్వే తీరును పర్యవేక్షించారు. రక్తనమూనాల సేకరణలో సహక
రించని వారికి అవగాహన కల్పించారు. కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య రోజూ సర్వే తీరు పరిశీలిస్తూ ఇతర శాఖల అధికారులను సమన్వయపరుస్తూ సమీక్షలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సర్వేను పరిశీలించి వేగవంతం చేశారు. దీంతో చంచుపల్లి, తాడ్వాయి, కాటాపూర్ పీహెచ్‌సీల్లో వంద శాతం పూర్తి కాగా, మిగతా 12 పీహెచ్‌సీల్లో 90శాతం పూర్తయ్యింది.

జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ అమలుకు 15 పీహెచ్‌సీల పరిధిలో మొత్తం 120 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున మొత్తం 360 మంది వైద్య సిబ్బందిని నియమించారు. అందు లో ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాలు, మెడికల్ కిట్లను సరఫరా చేసింది. ఒక్కో బృందం రోజుకు 10 నుంచి 12 కుటుంబాలను సర్వే చేసి, 30 నుంచి 40మంది నుంచి రక్త నమూనాలను సేకరించారు. ములుగు, ఏటూరునాగారం టీ డయాగ్నస్టిక్ సెంటర్లకు తరలించారు. పరీక్షల తర్వాత రిపోర్టులను తయారు చేశారు. సేకరించిన సమాచారాన్ని డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేశారు.