వరంగల్చౌరస్తా/కరీమాబాద్/ఖిలావరంగల్/కాశీబుగ్గ, జూన్ 8: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలోని ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ అన్నారు. పట్టణ ప్రగతిలో బుధవారం ఆమె 36వ డివిజన్లోని జ్యోతిబసునగర్, శాంతినగర్, చంద్రవదనకాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మసూద్, టీఆర్ఎస్ నాయకులు మర్రి శ్రీను, టీఆర్ఎస్ డివిజన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కరీమాబాద్ పరిధిలోని 32, 39, 40, 41, 42 డివిజన్లలో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన పర్యటించారు. గుర్తించిన సమస్యలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 38వ డివిజన్ రుద్రమాంబనగర్లో కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్యాదవ్, అధికారులు విస్తృతంగా పర్యటించారు.
సమస్యలపై ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. మిషన్ భగీరథ పైపులైన్లు, శ్మశాన వాటికను పరిశీలించారు. 37వ డివిజన్ తూర్పుకోటలో జరిగిన పట్టణ ప్రగతితో కార్పొరేటర్ బోగి సువర్ణాసురేశ్, మాజీ కార్పొరేటర్ బిల్లా కవితాశ్రీకాంత్, అధికారులు పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు విజయ్ పాల్గొన్నారు. 3వ డివిజన్ కొత్తపేటలో స్థానిక సమస్యలను కార్పొరేటర్ జన్ను షీభారాణి-అనిల్ అడిగి తెలుసుకున్నారు. జేసీబీ సాయంతో పిచ్చిమొక్కలను తొలగించారు.
నర్సంపేట: అభివృద్ధి పనుల్లో నర్సంపేట పట్టణం ముందంజలో ఉందని మున్సిపల్ చైర్పర్సన్ గంటి రజినీకిషన్ అన్నారు. బుధవారం ఆమె నర్సంపేటలో పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నర్సంపేటలో ఇప్పటికే రూ. 50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు మంజూరు చేసిందన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పనులు చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ నాయిని వెంకటస్వామి, కౌన్సిలర్లు రాయిడి కీర్తి దుశ్యంత్రెడ్డి, పాషా, గోల్య, రాజు, రమాదేవి పాల్గొన్నారు.