జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోహిణి కార్తెలో కొట్టే ఎండలకు రోళ్లు పలుగుతాయనే నానుడిని నిజం చేస్తూ భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. శుక్రవారం 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగత్ర నమోదైంది. గ్రామాల్లో కూలీలు, రైతులు ఉపాధి హామీ, వ్యవసాయ పనులకు ఉదయం 5 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలలోపు ఇండ్లకు చేరుకుంటున్నారు. రానున్న రెండుమూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాలులు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.
హనుమకొండ, జూన్ 4 : జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. రోహిణి కార్తెలో కొట్టే ఎండలకు రోళ్లు పలుగుతాయనే నానుడిని నిజం చేస్తూ భానుడు నిప్పుల కొలిమిలా మం డుతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. జిల్లా లో మే 28వ తేదీన 41.9 డిగ్రీలు, ఈ నెల 3వ తేదీన 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం ఆరు గంటలు దాటినా కూడా వేడి తగ్గడం లేదు. దీంతో ఉప శమనం కోసం ఏసీలు, కూలర్ల కింద సేద తీరుతున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలాఖరులో ఎండలు పెరుగతుండేవని, ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపించడంతో పాటు మే లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సూర్యుడు నిప్పుల కుంపటిగా మారడంతో పాటు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తప్పనిసరి బయటకు వెళ్తే ఎండ వేడిని తట్టుకునేందుకు గొడుగు, నెత్తికి క్యాపులు, రుమాళ్లు, స్కార్ఫ్లు లాంటివి వినియోగిస్తున్నారు. గ్రామాల్లో సైతం వ్యవసాయ, ఉపాధి హామీ పనులకు కూలీలు కూడా ఉదయం 5 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలలోపు ఇండ్లకు చేరుకుంటున్నారు. ఎండలో ఎక్కువ సేపు ఉండడం వల్ల కొందరు వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్నారు. సాధ్యమైనంత వరకు ఉదయమే పనులు ముగించుకుని 10 గంటలలోపు ఇండ్లలోకి చేరే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రానున్న రెండుమూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు, వడ గాలులు సైతం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలని పేర్కొంటున్నారు.