చిన్నగూడూరు, జూన్ 4: గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా కూడా బకాయిలేదని, కేంద్ర ప్రభుత్వమే రెండు నెలలుగా రాష్ర్టానికి రావాల్సిన రూ. 1400 కోట్లు పెండింగ్‌లో పెట్టి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నదని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదని బీజేపీ నాయకులు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. మండల పరిధి ఉగ్గంపల్లిలో శనివారం ఆయన స్థానికులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వా ల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని పల్లెలు, స్వరాష్ట్రంలో ఎనిదేళ్లలో ఎంతో పురోగతిని సాధించాయన్నారు. తెలంగాణపై చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోకపోతే రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లకు నిరాకరించినప్పటికీ రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలిచారని పేర్కొన్నారు.
ఒక ఎమ్మెల్యేగా మారుమూల గిరిజన తండాలోనే ఉంటూ ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఒకప్పుడు దయనీయ స్థితిలో ఉన్న పల్లెలు నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కంటికి ఎందుకు కనిపించడంలేదో అతడి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. దొంగే దొంగ అన్న చందంగా జీజేపీ తీరు ఉందన్నారు. రాష్ర్టానికి రావాల్సిన బకాయిని ఇప్పించగలవా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడితే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తానన్నారు. బకాయిలు చెల్లించకుంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్ఎస్ ఉద్యమం చేయడం ఖాయమన్నారు. సర్పంచ్‌లు అధికారులు, గ్రామస్తులను సమన్వయం చేసుకుంటూ పల్లె ప్రగతిని విజయవంతం చేయాలన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. విద్య, వైద్యరంగాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నా రు. చివరి ఆయకట్టు వరకూ సాగునీరందించే లక్ష్యంతో తెలంగాణలో వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం వంటి ప్రాజెక్టును నిర్మించిందన్నారు. ఫలితంగా కోటి ఎకరాలకు సాగు నీరందుతూ తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
దళిత కుటుంబాల ఆర్థిక బలోపేతానికి ‘దళితబంధు’ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలతోపాటు కుల వృత్తిదారులకు ఆసరా పింఛన్లు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడపడుచులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో అమలవుతు న్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి ఎ న్నో పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయని, అక్కడ కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. సమావేశంలో సర్పంచ్ పూలమ్మ, ఎంపీటీసీ ఉదయమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంసింగ్, కొమిరెల్లి, మల్లేశం, అంబరీష, గంగరాజు, యాకూబ్, మల్లయ్య పాల్గొన్నారు.
గ్రామంలో కొత్తగా నిర్మించిన ఆలయంలో రామలింగేశ్వరస్వామి, బొడ్రాయి, ముత్యాలమ్మ విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుటుంబ సభ్యులతో పాల్గొని పూజలు చేశారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ వేడుకలకు గ్రామస్తులు తరలి రావాలన్నారు.