సుబేదారి, అక్టోబర్ 11 : వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ కుడా బదిలీ అయ్యారు. రాష్ట్రంలో రంగారెడ్డి, మేడ్చెల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
పదినెలల్లో తనదైన మార్క్
ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీసు కమిషనర్గా గత ఏడాది డిసెంబర్ 3న బాధ్యతలు చేపట్టారు. పనిచేసిన పది నెలల వ్యవధిలో తనదైన మార్క్ చూపించారు. ప్రధానంగా కమిషనరేట్ పరిధిలోని నగరంలో భూ ఆక్రమణదారులపై కొరడా ఝులిపించారు. అమాయకుల భూములను ఆక్రమించిన ఎంతటివారినైనా వదిలిపెట్టకుండా జైలుకు పంపించారు. వీరిలో ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఉన్నారు.
అనైతిక చర్యలకు పాల్పడిన గీసుగొండ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, భూ ఆక్రమణదారులకు సపోర్ట్ చేసిన మట్టెవాడ ఇన్స్పెక్టర్ రమేశ్, హసన్పర్తి ఇన్స్పెక్టర్ నరేందర్, కేయూ ఇన్స్పెక్టర్ దయాకర్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నరేశ్, హనుమకొండ ట్రాఫిక్ ఆర్ఐ సతీశ్, ఇటీవల నర్మెట్ట ఇన్స్పెక్టర్ నాగబాబు, ఏడుగురు ఎస్సైలు, ఒక మహిళా ఏఎస్సై, ఒక హెడ్ కానిస్టేబుల్, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేశారు. భూ దందాలు, గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్లు పెట్టి జైలుకు పంపించారు. విధి నిర్వహణలో ఎంత బిజీ ఉన్నా కమిషనరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. చాలా మంది భూబాధితులు సీపీ చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేశారు. ముఖ్యంగా భూ ఆక్రమణలు, తగాదాల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని బాధితులకు న్యాయం చేశారు.