వరంగల్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్‌లో మరోసారి ‘గ్రూపు’ జెండా రెపరెపలాడింది. పార్టీ అంతర్గత, బహిరంగ కార్యక్రమాల్లోనే కాదు.. ప్రభుత్వ అధికారిక వేడుకల్లోనూ తమది ఎడమొహం.. పెడమొహమే అని నిరూపించింది. గత కొంతకాలంగా తూర్పు, పడమరలుగా వ్యవహరిస్తూ తమ ఆధిక్యాన్ని, ఆధిపత్యాన్ని పరదర్శిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు బుధవారం సైతం అదే ఒరవడిని కొనసాగించారని స్వయంగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
ప్రజాపాలన పేరుతో సెప్టెంబర్ 17 నేపథ్యంగా జరిగిన అధికారిక కార్యక్రమంలో ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు వైరి శిబిరాలుగా విడిపోయారు. ఆ శిబిరాల పటాటోపం చివరికి మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొనే జిల్లాల మార్పు దాకా వెళ్లిందని, అందుకు బుధవారం చోటుచేసుకున్న పరిణామమే నిదర్శనమని ఆ పార్టీ నేతలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ముదిరిన ఈ గ్రూపు వార్ ఎటువైపు వెళ్తుందోననే దిగులు వారిలో వ్యక్తమవుతున్నది.
మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు వ్యవహార శైలితో విభేదిస్తున్న ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు గాంధీభవన్ నుంచి మొదలుకొని పార్టీ హైకమాండ్ దాకా డజన్ల కొద్దీ ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. వాటికి గాంధీభవన్ సాక్షిగా కొండా దంపతులు వివ‘రణ’ ప్రదర్శనలు చేయటమూ తెలిసిందే.
తాజాగా భద్రకాళీ ధర్మకర్తల నియామకం విషయంలో మంత్రి కొండా సురేఖ ఏకపక్షంగా వ్యవహరించారని, తన నియోజకవర్గ పరిధిలో తనకు తెలియకుండా నియామకం చేయడం ఏమిటటంటూ అధిష్టానానికి నాయిని ఫిర్యాదు చేయగా, మంత్రిగా ఇద్దరు ధర్మకర్తలను నియమించుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? అని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి కుత్సిత బుద్ధి వల్లే ఏనాడో కావాల్సిన ఎమ్మెల్యే ఇప్పుడు అయ్యారనే కోణంలో ఎమ్మెల్యే నాయినిపై నిప్పులు చెరిగారు.
అందుకు పదవుల కోసం పార్టీలు మారితే తాను ఏనాడో ఎమ్మెల్యే అయ్యేవాడినని నాయిని ఎద్దేవా చేశారు. మొత్తంగా గ్రేటర్ వరంగల్‌లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రి, ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనే వాతావరణం నెలకొన్నది. ఈ పరిణామాలకు కొనసాగింపుగా సెప్టెంబర్ 17 కార్యక్రమం వచ్చిపడింది.
ప్రజాపాలన పేరుతో నిర్వహించే సర్కారు కార్యక్రమంలో స్వాతంత్య్ర, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు గతేడాది సెప్టెంబర్ 17న నిర్వహించిన వేడుకలకు హనుమకొండలో సురేఖ, వరంగల్‌లో ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొంటున్నారు. అయితే, బుధవారం మాత్ర వారు అటు, ఇటు అయ్యారు. హనుమకొండ కార్యక్రమానికి సురేఖ ముఖ్యఅతిథిగా వస్తే తాము హాజరుకామని ఇటు గాంధీభవన్, అటు సీఎంవోకు ఆమె వ్యతిరేక కూటమి చెప్పిందని, ఈ నేపథ్యంలోనే వారిని మార్చారనే చర్చ జరుగుతున్నది.
వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి దూరంగా ఉన్నారు. అదే హనుమకొండ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు తదితరులు హాజరయ్యారు. మేయర్ గుండు సుధారాణి రెండుచోట్లా హాజరు వేసుకోవటం గమనార్హం. ఇక పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి రెండుచోట్లా హాజరుకాకపోయినా డీసీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాత్రం పాల్గొన్నారు. మొత్తానికి మంత్రి పొంగులేటి వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు పరుగులు పెడితే.. సురేఖ మాత్రం ప్రజాపాలన వేడుకలో ఒంటరిగా పాల్గొనడం హాట్‌టాపిక్‌గా మారింది.