కాజీపేట, ఫిబ్రవరి 10 : కేంద్ర ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్సు ద్వారా నక్ష పథకంలో భాగంగా ప్రణాళిక లేని పట్టణాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సర్వే చేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. హెలికాప్టర్‌తో నిర్వహిస్తున్న డిజిటల్ ఏరియల్ భూసర్వే ప్రక్రియను కాజీపేట సెయింట్ గాబ్రియల్ మైదానంలో సోమవారం ఆమె క్షేత్రస్థాయి లో పరిశీలించి నిర్వహణ తీరును సాంకేతిక సిబ్బందిని అడిగి తె లుసుకున్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పైలట్ ప్రాజెక్టులో భా గంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏరియల్ ఫోటోగ్రఫీ, టెక్నాలజీ(2డీ)ను వినియోగిస్తూ సర్వే కొనసాగిస్తారని కలెక్టర్ చెప్పా రు.
దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలు, చెరువులు, కాల్వలు, రోడ్లు, హైటెన్షన్ విద్యుత్ వైర్లు అక్షాంశాలు, రేఖాంశాలను నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీని వల్ల భూమికి నిజమైన యజమానులు ఎవరో గుర్తించడం సులభమవుతుంద ని తెలిపారు. మున్సిపాలిటీల్లో ప్రాథమిక సమాచార సేకరణే లక్ష్యంగా సర్వే కొనసాగుతుందన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో మొత్తం 41 కిలోమీటర్ల మేర సర్వే చేయాల్సి ఉన్నదని, మంగళవారంలోగా సర్వే పూర్తిచేస్తామని వారం తర్వాత చిత్రాలను అందచేస్తారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశా ల మేర కు కార్యాచరణ సిద్ధం చేసి అమలుచేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.