హనుమకొండ చౌరస్తా : వరంగల్ జిల్లాలో మహిళా క్రికెటర్లకు త్వరలో మంచి రోజులు వస్తాయని, హెచ్‌సీఏ ఆధ్వర్యంలో మహిళా క్రికెట్ పోటీలు నిర్వహించనున్నామని హెచ్‌సీఏ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లా కేంద్రాల్లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించారు. శనివారం వంగాలపల్లి క్రికెట్ క్రీడా మైదానంలో ముగింపు వేడుకలు జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శి టీ బస్వరాజు 6 జిల్లాల క్యాంప్ క్రీడాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు సదాశివ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో చాగంటి మాట్లాడుతూ.. జిల్లాలో నిరంతర క్రికెట్ క్యాంప్ అవశ్యకత గుర్తుచేస్తూ వంగాలపల్లి క్రికెట్ గ్రౌండ్‌ను హెచ్‌సీఏ పరిధిలోకి తీసుకోవాలని ప్రతిపాదనలు వచ్చాయని, రాబోయే ఏజీఎం మీటింగ్‌లో జిల్లాకి ఫ్లడ్లైట్స్ వెలుగులో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు పర్మిషన్ రాబోతోందని తెలిపారు.
కార్యక్రమంలో హైదరాబాద్ క్లబ్ కార్యదర్శులు భార్గవ్, శంకర్, జిల్లా సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్, కార్యవర్గ సభ్యులు వేణు గోపాల్, అభినవ వినయ్, అజయ్ సారథి, వివిధ జిల్లాల క్రికెట్ ప్రతినిధులు పాల్గొన్నారు.