పల్లెల్లో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
డీపీవో చంద్రమౌళి
శాయంపేట, జూన్ 4: కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి అన్నారు. మండలంలోని తహార్‌పూర్, పెద్దకోడెపాక, శాయంపేట, పత్తిపాక, మైలారం గ్రామాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఆయా గ్రామాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఎందుకు నమోదవుతున్నాయో అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారో ఆలోచించాలని సూచించారు. గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం మంచి పరిణామం కాదన్నారు. ప్రతి గ్రామంలో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, అందులో కరోనా బాధితులను ఉంచాలన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని, ఇందుకు ఐసొలేషన్ కేంద్రాలు దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా పెద్దకోడెపాకలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. శాయంపేట, చెన్నారావుపేట, నర్సంపేట మండలాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ గుర్తించినట్లు వెల్లడించారు. ఎక్కడ లోపం ఉందో తెలుసుకుని కట్టడికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించినట్లు డీపీవో వెల్లడించారు.
రసాయనాలను పిచికారీ చేయాలి
గ్రామాల్లో రెండురోజులకోసారి జీపీ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక్క షాపు కూడా తెరిచి ఉండొద్దని, ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని కోరారు. శుభకార్యాలు నిబంధనల మేరకే జరుగాలన్నారు. జిల్లాలో కరోనా కేసులు అధికంగా ఉన్న టాప్ 50 గ్రామాల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. వైరస్ నియంత్రణకు గ్రామాల్లో రోడ్లపైనే కాకుండా అన్నిచోట్లా బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. ఇకనైనా పరిస్థితిలో మార్పు వచ్చేలా అందరూ కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో రంజిత్‌కుమార్, కార్యుదర్శులు ఉన్నారు.