నర్సంపేట రూరల్, ఫిబ్రవరి 18: జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన విలేజ్ పార్కుల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులు, ప్రజాప్రతినిధులను అదనపు కలెక్టర్ హరిసింగ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని లక్నేపల్లి విలేజ్ పార్కు, ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా జీపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. విలేజ్ పార్కులో విరివిరిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పార్కులతో గ్రామీణ ప్రజలకు ప్రశాంతత లభిస్తుందన్నారు. గ్రామస్తులు కూడా పార్కుల అభివృద్ధికి సహకారించాలని కోరారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కలుపు మొక్కలను వెంటవెంటనే తొలగించాలని సూచించారు. మొక్కలు ఎదిగేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడిశాల రాంబాబు, అనిత, కారోబార్ రాజయ్య పాల్గొన్నారు.
అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
గీసుగొండ: గ్రామాల అభివృద్ధికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కోరారు. మండలంలోని దస్రుతండాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంతోపాటు విలేజ్ పార్కు, శ్మశాన వాటికను పరిశీలించారు. గ్రామస్తుల సలహాలు, సూచనలు తీసుకుని విలేజ్‌ని పూర్తిగా అభివృద్ధి చేసుకోవాలని ఆయన సర్పంచ్, కార్యదర్శికి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీకి భవనం కావాలని సర్పంచ్, వార్డు సభ్యులు కోరడంతో నిధులు మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ కేలోత్ సరోజ, సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి సహజ, ఉపసర్పంచ్ గోపి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.