పరకాల, ఏప్రిల్ 27 : పంట దిగుబడి రాని మొక్కజొన్న విత్తనాలు అంటగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు రైతులు విలీన గ్రామం రాజీపేటలో బుధవారం ధర్నా చేశారు. రైతుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వసుధ అగ్రిటెక్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలు అత్యధిక దిగుబడి వస్తాయంటూ శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మేకల విజేందర్ రెడ్డి, దండెపల్లి గ్రామానికి చెందిన దుగ్యాల దేవేందర్ రావు పరకాల పట్టణ విలీన గ్రామాలు రాజీపేట, సీతారాంపురంతో పాటు నడికూడ మండలం ధర్మారం రైతులకు మొక్కజొన్న సీడ్‌ను ఇచ్చారు. ఈ సమయంలో మొక్కజొన్న పంటను బెండుతో సహా కొనుగోలు చేస్తామంటూ ఒప్పందం చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో 50 ఎకరాల మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు నిరాశే కలిగింది. మొక్కజొన్న ఎదగక పోవడంతో పాటు పీచు పెట్టలేదు. కంపెనీ ప్రతినిధులను పలు మార్లు కలిసినా ప్రయోజనం లేదు. ఈ విషయమై నష్టపోయిన పలువురు రైతులు రాజీపేట గ్రామంలోని అంబాల రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తమను ఆదుకుని సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. సీఐ పుల్యాల కిషన్ రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. కాగా, సదరు రైతులు కంపెనీపై చర్యలు తీసుకోవాంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ధర్నాలో ఉడుత శివ, గొడుగు తిరుపతి, ఇంటి రాజిరెడ్డితో పాటు 30 మంది రైతులు పాల్గొన్నారు.