హనుమకొండ/నర్సంపేట, ఏప్రిల్ 19 : అభివృద్ధికి అర్థం చెప్పిన సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వరంగల్ నగరం అనితర సాధ్యమైన ప్రగతిని సాధిస్తున్నదని, చరిత్రలో నిలిచిపోయేలా ఇక్కడ పనులు చేపడుతున్నామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్లీనరీ సన్నాహకంగా బాలసముద్రంలోని కుడా మైదానంలో తలపెట్టిన పార్టీ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి రామన్న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు గ్రేటర్ పరిధిలో రూ.188.83కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొత్తగా చేపట్టేవాటికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారని, బాలసముద్రంలోని కుడా మైదానంలో తలపెట్టిన పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని, గ్రేటర్ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీశిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడుతూ నగరంలో మొత్తం రూ. 188.83 కోట్లతో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని, పలు పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దిగుతారని, అక్కడి నుంచి నేరుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి రోడ్డు మార్గాన చేరుకుంటారని చెప్పారు. అక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మళ్లీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకొని హెలీకాప్టర్‌లో నర్సంపేటకు వెళ్తారని వివరించారు.
అక్కడ ఎమ్మెల్యే పెద్దితో కలిసి పలు ప్రారంభోత్సవాలు, శంకస్థాపనలు చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హనుమకొండకు చేరుకొని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఇంట్లో భోజనం చేస్తారన్నారు. ఆ తరువాత హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాల అధికారులు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, ఇతర శాఖల అధికారులతో సమీక్షిస్తారని వివరించారు. ఈ సమావేశానికి రెండు శాఖల ఈఎన్సీలు కూడా వస్తారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంట్లో టీ బ్రేక్ తర్వాత కుడా మైదానంలో చేపట్టిన హనుమకొండ, వరంగల్ జిల్లాల టీఆర్ఎస్ ప్రతినిధుల సభలో పాల్గొంటారని తెలిపారు.
పార్టీ 21ఏళ్ల ప్రస్థానం, ఎనిమిదేళ్లతో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతినిధులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలోనే సభలో హనుమకొండ, వరంగల్ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులుగా దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్ బాధ్యతల స్వీకరణ ఉంటుందన్నారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లే క్రమంలో కరుణపురం వద్ద వరంగల్ ఎంట్రెన్స్ ఆర్చ్‌ను కేటీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వరంగల్ దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి చెందుతున్నదని, ఇందుకు కారణమైన కేసీఆర్, కేటీఆర్‌కు రుణపడి ఉంటామని అన్నారు.
అభివృద్ధిని ఓర్వలేకపోతున్నరు
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర పార్టీల నాయకులు ఓర్వలేకపోతున్నారని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మంత్రి కేటీఆర్ హనుమకొండ, వరంగల్ జిల్లాల పర్యటనకు ప్రజల పక్షాన స్వాగతిస్తున్నామన్నారు. ప్రతినిధుల సభలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. అధికారదాహం కోసం కొందరు పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వారి మాటలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం విస్మరించిన బాధ్యతలను గుర్తు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, ఇలాంటి వారి విషయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల బూత్ కమిటీ సభ్యులు, ప్రతినిధులు కలిపి 17వేల మందికిపైగా ఉన్నారని, వారంతా సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని చీఫ్‌విప్ దాస్యం, ఎమ్మెల్యే అరూరి కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వొడితెల సతీశ్‌బాబు, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, జడ్పీ అధ్యక్షులు సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు పాల్గొన్నారు.