Balka Suman | క్యాతనపల్లిలో జరిగింది ఇది!
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఘోర ఓటమితో మంత్రి వివేక్ ఎలాగైనా క్యాతనపల్లి మున్సిపాలిటీని దక్కించుకోవాలని కుట్రలు చేస్తూ వస్తున్నారు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, ఎన్నికలు జరుగకుండా అడ్డుకు నేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకొని వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు తిరగబడటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రాళ్లు విసిరి గొడవకు ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులను వదిలి ఉల్టా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా మరో 8 మంది బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు.
మెదక్‌లో ఏం జరిగిందంటే!
ఈనెల 9న మెదక్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. కులం పేరుతో దూషించారని బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్త గోదాల అఖిల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అదేరోజు రాత్రి గొడవ జరిగిన చోటుకు అనుచరులు, గూండాలతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వెళ్లడంతో ఇరుపార్టీల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఆ సమయంలో మెదక్ ఎమ్మెల్యే వాహనంపై బీఆర్ఎస్ నాయకులు రాళ్లతో దాడిచేసినట్టు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారు.
మంచిర్యాల, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలనే దుర్బుద్ధితో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అరెస్టు చేయించింది. మున్సిపల్ పీఠం చేజిక్కించుకునేందుకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను రెండుసార్లు వాయిదా వేయించి, కౌన్సిలర్లను ఇబ్బందులు పెట్టినా, చివరకు ఖాళీ చెక్కులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసినా ఫలితం లేకపోవడంతో తప్పుడు కేసులతో దుర్మార్గంగా, దౌర్జన్యంగా వ్యవహరించారు. పోలీసుల విధులను ఆటంక పరిచి, భయభ్రాంతులకు గురి చేశారంటూ మంగళవారం అర్ధరాత్రి దాదాపు 10 గంటల
సమయంలో రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో దేవాపూర్ ఎస్ఐతో కేసు పెట్టించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, గుడిసెల రాజా రమేశ్, అనిల్, గాజుల చంద్రకిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్‌రెడ్డి, రామిడి లక్ష్మీకాంత్, బండారి సూరిబాబులపై 189(3), 191(2), 191(3), 121(2), 223 ఆర్/డబ్ల్యూ, 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే బుధవారం బాల్క సుమన్‌తోపాటు ఇతర బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు.
కాంగ్రెస్ తీరును నిరసిస్తూ క్యాతనపల్లి బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో క్యాతనపల్లి లోని బాల్క సుమన్ ఇంటి చుట్టూ నిఘా పెట్టి వందలాది మంది పోలీసులు మూకుమ్మడిగా వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రామగుడు లక్ష్మణ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. చెన్నూర్‌లో బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ దోమకొండ అనిల్, రామకృష్ణాపూర్‌కు చెందిన నాయకుడు రామిడి లక్ష్మీకాంత్‌లను ఉదయమే అదుపులోకి తీసుకొన్నారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు సుమన్ ఇంటికి చేరుకొని కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమన్‌ను తీసుకెళ్లకుండా అడ్డుకోగా పోలీసులు చెదరగొట్టి బాల్క సుమన్‌ను మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత మంచిర్యాల జిల్లా కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి పోలీసుల వాహనాలను అడ్డుకొనేందుకు యత్నించగా చెదరగొట్టారు. కోర్టు వద్ద కూడా బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. సుమన్‌ను కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆదిలాబాద్ జైలుకు తరలించారు. సుమన్‌కు జైలుకు తరలించిన తర్వాత మూల రాజిరెడ్డి, అనిల్‌ను కోర్టుకు తీసుకొచ్చి, జైలుకు తీసుకెళ్లారు.
క్యాతనపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన గొడవ ఘటనపై రామకృష్ణాపూర్ పోలీసులు నమోదు చేసిన క్రైం నంబర్ 40/26, 41/26 రెండు కేసుల్లో బాల్క సుమన్‌ను, వారి అనుచరులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ న్యాయవాది గడ్డం శ్రీనివాస్, అకుల రవీందర్ మాట్లాడారు. పోలీసులపై రాళ్లతో బాల్క సుమన్ దాడి చేశారని, గొడవకు ప్రేరేపించారని ఆరోపిస్తూ వారు కోర్టుకు సమర్పించారని తెలిపారు. అయితే ఆ పెన్డ్రైవ్లోని వీడియోలో ఎక్కడ కూడా బాల్క సుమన్ దాడి చేసినట్టు గానీ, పాల్గొన్న దృశ్యాలు కనిపించలేదని చెప్పారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం అరెస్ట్చేయవద్దని వాదనలు వినిపించామని చెప్పా రు. పోలీసుల విచారణ కోసం 14 రోజుల పాటు రిమాండ్ అనంతరం విడుదలైన తర్వాత ప్రాసిక్యూషన్‌వారు ఎలాంటి నిజనిర్ధారణ చేస్తారన్నది చూడా ల్సి ఉందన్నారు. బెయిల్ పిటిషన్ కోసం తమ లీగల్ టీంతో చర్చించుకొని జిల్లా కోర్టులో లేదా హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
అధికార పార్టీ నిర్బంధంలోనూ క్యాతనపల్లిలో బుధవారం బంద్ సంపూర్ణమైంది. ఎన్నిక జరుగకుండా బీఆర్ఎస్-సీపీఐ మహిళా కౌన్సిలర్లతో కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, సీపీఐలు పిలుపునిచ్చాయి. ప్రజాతీర్పునకు కట్టుబడి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.

మంచిర్యాల, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీతో కొట్లాడుతున్నా.. అందుకు నన్ను జైలుకు పంపినా, నా మీద రౌడీ, గూండా అని ముద్ర వేసినా, చివరకు మంత్రి వివేక్ కిరాయి గూండాలతో చంపించినా అదరను.. బెదరను’ అని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తేల్చిచెప్పారు. బుధవారం పోలీసులు అరెస్టు చేసేందుకు ముందు క్యాతనపల్లిలోని తన స్వగృహంలో, అరెస్టు చేశాక కోర్టు నుంచి బయటికి తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నేను కేసీఆర్ శిష్యుడని గుర్తుపెట్టుకోండి. జైలుకు పంపిస్తే భయపడుతాం అనుకుంటున్నారా.. జైలు నుంచి వచ్చాక ఇంకా బలంగా కొట్లాడుతా’ అని స్పష్టం చేశారు. కేసీఆర్ శిష్యుడిగా.. తెలంగాణ ఉద్యమకారుడిగా తనకు కేసులు, జైళ్లు కొత్తకాదని చెప్పారు.
తనను అరెస్టు చేసి మంత్రి వివేక్ కండ్లల్లో ఆనందం చూసేందుకు పోలీస్, రెవెన్యూ అధికారులు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. తనను జైలుకు పంపి, నయానో భయానో క్యాతనపల్లి మున్సిపాలిటీని నెగ్గించుకోవాలని చూస్తున్నారని.. కానీ పారదర్శకంగా ఎన్నిక జరిగేలా చూడాలని, లేకపోతే మంత్రి వివేక్, ఎంపీ వంశీ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. క్యాతనపల్లిలో పట్టపగలే తమరు చేసిన దుశ్శాసన పర్వం గురించి ఇప్పటికే ప్రజలు తిట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరేం చేసినా క్యాతనపల్లి మున్సిపాలిటీ గెలిచింది బీఆర్ఎస్సే అన్నది ప్రజల గుండెల్లో ఉండిపోతుందని చెప్పారు. మంత్రి వివేక్‌కు ఊడిగం చేస్తున్న జిల్లా అధికారులు, పోలీసులు తమ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. క్యాతనపల్లి బంద్‌ను ఏకపక్షంగా విజయవంతం చేసిన మున్సిపాలిటీ ప్రజలకు ఈ సందర్భంగా బాల్క సుమన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

