ఆంధ్రా ముఠా ద్వారా తెలంగాణకు నష్టం చేయించడమే కాకుండా, తన వ్యక్తిగత చర్యల వల్ల కూడా తీర్చలేని కష్టాలు, నష్టాలు కలిగించారు సమైక్య పాలకులు. ఉమ్మడి రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నుంచి ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు తెలంగాణకు నష్టం చెయ్యని ఆంధ్రా పాలకుడు ఒక్కరూ లేరు ఆ గుంపులో.
వలస పాలకుల వివక్ష తెలంగాణ జిల్లాలను సంక్షోభంలో పడేసింది. అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టులను ఆపేయడంతో పాలమూరు జిల్లా ఎండిపోయింది. రైతుల్లో ఎక్కువ శాతం ఇతర జిల్లాలకు, రాష్ర్టాలకు కూలీ పనుల కోసం వలసపోయారు. కృష్ణా నదీ జలాలు రాయలసీమకు ఎక్కువగా తరలించాలని వలస వంచకులు ఈ ప్రాజెక్టులను నిలిపివేశారు. దాంతో 2014 వరకు రోజూ రాత్రి పూటకు 3 బస్సుల నిండా
ఆ జిల్లా వాసులు ఇతర రాష్ర్టాలకు వలసపోయారు. ఇది మూడు తరాల వారిని హింసపెట్టిన వలస పాలకుల 27వ తప్పు. 2014
తర్వాత తెలంగాణ పాలనలో మార్పు వచ్చింది. ఇప్పుడు వలస బస్సులు ఆగిపోయాయి.
గతవారం ప్రచురించిన ‘కాంగ్రెస్ పాపాలు.. చిత్రగుప్తుడి చిట్టాలోంచి’కి కొనసాగింపుగా…
17. తెలంగాణలో నీటిపారుదల సౌలభ్యం కోసం 1944 నాటికే నిజాం ప్రభుత్వం చాలా ప్రాజెక్టులను సిద్ధం చేసింది. అప్పటి పరిస్థితుల్లో వెంటనే వాటిని ప్రారంభించడానికి వీలుపడలేదు. వెల్లోడి ప్రభుత్వం 1951 జూలైలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆ ప్రాజెక్టులన్నింటికీ అనుమతి పొందింది. కానీ, ఫజల్ అలీ తన నివేదికలో పేర్కొన్నట్టు ఆంధ్రాతో విలీనమయ్యాక ఈ ప్రాజెక్టులన్నీ మూతపడ్డాయి. ఆయన ఊహించిందే నిజమై తెలంగాణ మిగులు నిధులు రూ.67 కోట్లు ఆంధ్రాలోని ప్రకాశం బరాజ్, ధవళేశ్వరం ఆనకట్టలు మళ్లీ కట్టడానికి ఆంధ్రా పాలకుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయి. డబ్బు ముఖం చూడక ఆంధ్ర రాష్ట్రంలో అల్లాడినవారు కుబేరులయ్యారు. తెలంగాణ తలపెట్టి, అనుమతులు పొందిన ప్రాజెక్టులు మూలనపడ్డాయి, పురుడు పోసుకోకుండానే మరణించాయి. ఇది కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ చేసిన 17వ పాపం! దీనివల్ల ఐదు దశాబ్దాలు నరకం అనుభవించిన తెలంగాణ.. ఆ పార్టీని ఆదరించకూడదు.
18. 1923-31లో నిర్మించిన నిజాంసాగర్, అప్పర్ మానేరు (1950), ఘనపూర్ ఆయకట్టు (1905), డిండి, మూసీ (1954) అన్నీ నిజాం కాలంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులే. రామప్ప, పాకాల, ఘనపురం, శనిగరం, శాలిగౌరారం, పెండ్లిపాకల, భీమునిపల్లి, ఆసిఫ్నగర్ను కూడా నిజాం పునరుద్ధరించారు. నిజాం రాజులు ప్రజలకు అత్యవసరమైన వ్యవసాయం పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే 1867 నాటికే ఏటా బడ్జెట్లో రూ.2 లక్షలు నీటిపారుదల రంగానికి కేటాయించేవారు. రోస్ అలెన్ అనే బ్రిటిష్ ఇంజినీర్, నీటిపారుదలరంగ నిపుణుడిని చీఫ్ ఇంజినీర్‌గా నియమించారు 1897లో. ఈ రంగం గురించి ఇంత శ్రద్ధ తీసుకున్న నిజాంకు వ్యతిరేకంగా పోట్లాడిన కమ్యూనిస్టులకు ఆంధ్రా కుటిలత్వాలు కండ్లబడలేదు. ఏ ఒక్కరోజూ, ఏ ఒక్క అన్యాయాన్నీ ఎదుర్కోవటానికి పోరాటం చేయలేదు.. అప్పుడప్పుడు మాటలు తప్ప. ఆ పార్టీకి కూడా, కాంగ్రెస్‌తోపాటు మంగళం పాడాలి తెలంగాణ ప్రజలు. ఇది ఈ పార్టీలు చేసిన 18వ పాపం!
19. నెహ్రూ మంత్రివర్గంలో ఆంధ్రా మనిషే అయిన కేఎల్ రావు అనే ఇంజినీర్ నీటిపారుదలశాఖ మంత్రిగా ఉండేవాడు. ఆయన స్పష్టంగా పోచంపాడు ప్రాజెక్టు తెలంగాణకు ఎంత ముఖ్యమో చెప్పాడు. అయినా 1958లో ఆ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పావు వంతుకు తగ్గించాడు సంజీవరెడ్డి. 257 టీఎంసీలతో ఆరు జిల్లాలకు నీరు అందించాల్సిన ఆ ప్రాజెక్టును 60 టీఎంసీలతో 2 జిల్లాలకు మాత్రమే పరిమితం చేసి, పాపం మూటగట్టుకున్నాడు సంజీవరెడ్డి. దానితో ప్రతిపాదించిన ఉత్తర కాల్వ విద్యుత్తు ఉత్పాదన, దక్షిణ కాల్వ, మానేరు డ్యామ్ అన్నీ రద్దయిపోయాయి ఆయన మూలంగా.
20. ఇంకొక పని ఏమిటంటే.. లక్ష ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే దేవునూరు ప్రాజెక్టును నీలం సంజీవరెడ్డి నిష్కారణంగా రద్దు చేశాడు. అది గొప్ప బహుళార్థ సాధక ప్రాజెక్టు. తాగునీరు, సాగునీరు, విద్యుత్తు ఉత్పాదన చేసే బంగారు ప్రాజెక్టు ఆ నిరంకుశుడి వల్ల రద్దయిపోయింది.
21. ఈ ప్రాజెక్టును విరమించుకున్నందుకు పోచంపాడు సామర్థ్యాన్ని కుదించవద్దని ముఖ్యమంత్రిని రీజినల్ కమిటీ కోరింది. కానీ, తెలంగాణకు నష్టం చేకూర్చే పనికి పాల్పడ్డాడు.. సంజీవరెడ్డి. తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల మాటలను కూడా పట్టించుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ 21వ తప్పు. ఆ కుదించిన ప్రాజెక్టుకే ఏమీ పట్టనట్టు 1963 జూలైలో నెహ్రూ శంకుస్థాపన చేశాడు. రాష్ర్టానికి జరిగిన అన్ని అన్యాయాల్లో కేంద్రానికి కూడా పాత్ర ఉన్నది.
22. ఈ ప్రాజెక్టును ఇంకో రకంగా కూడా నిర్వీ ర్యం చేశాడు నీలం సంజీవరెడ్డి. 234 టీఎంసీల నీళ్లు లభిస్తున్నా మొదట 66 టీఎంసీలు చాలనీ, చివరిగా 41 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాజెక్టుకు ఖరారు చేశాడు ఆయనే. మిగతా నీరంతా ఆంధ్రాకే పారుతుంది కదా! ఇది 22వ తప్పు.
23. మొదట కడెం ప్రాజెక్టుకు 53 టీఎంసీల నీరు కేటాయించారు. దాన్ని వలస ప్రభుత్వం 12 టీఎంసీలకు కుదించింది. ఇది 23వ తప్పు.
24. వలస పాలకులు చేసిన ఇంకొక ద్రోహం ఏమిటంటే.. 1963లో ప్రారంభించిన పోచంపాడు ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసిన సామానంతా శ్రీశైలానికి తరలించి, ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేశారు. ఇది 24వ తప్పు, తీవ్ర అన్యాయం.
25. ఆ కాలమంతా తెలంగాణకు చెందాల్సిన నీళ్లను చాలా సమైక్య ప్రభుత్వం తక్కువగా తీసుకునేటప్పటికీ, ఆ నీటిని మహారాష్ట్రకు, కర్నాటకకు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. అయినా కూడా ఈ వలస ముఖ్యమంత్రులు నోరు విప్పలేదు. వేరేవాళ్లు బాగుపడవచ్చు, కానీ తెలంగాణ మాత్రం కూలిపోవాలి, ఎడారిగా మారాలి అనీ అలాగే మార్చారు కూడా! ఇది 25వ తప్పు.
26. ఉభయ ప్రాంతాలకు అవసరమున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. మొదట అనుకున్న ప్రాజెక్టు ఏలేశ్వరం దగ్గరైతే, తన ప్రాంతానికి ఎక్కువ లాభం చేకూరాలని ఇంకో ఆంధ్రుడు కేఎల్ రావు ఆ ప్రాజెక్టును బాగా కిందికి నందికొండ వద్దకు జరిపారు. నందికొండ వద్ద నిర్మిస్తే నష్టం జరుగుతుందని తెలంగాణ వారికి తెలిసినా నిస్సహాయులైపోయారు. నెహ్రూ ఒప్పుకోవడంతో ఆయనే శంకుస్థాపన కూడా చేశారు. దాని వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు అంటే, 1954 నుంచి 2014 వరకు దాదాపు ఆరు దశాబ్దాలు ఫ్లోరైడ్ భూతం నల్లగొండ వాసుల ఆరోగ్యాన్ని తినేసింది. ఇది వలస నాయకులు చేసిన క్షమించరాని నేరం. ఇది 26వ తప్పు. అంతేకాక ఈ ప్రాజెక్టులో నిపుణులు నిర్దేశించినట్టు కాకుండా తెలంగాణ ప్రాంత ఆయకట్టును తగ్గించి ఆంధ్రా ఆయకట్టు పెంచారు. దీనికి కాల్వను కేఎల్ రావు మళ్లించాడు. కానీ, ఖర్చు మాత్రం రెండు ప్రాంతాలకు సమంగా పంచారు. ఈ పాపంలో మోసం, నైతిక విలువల హననం కూడా కలిశాయి.
27. వలస పాలకుల వివక్ష తెలంగాణ జిల్లాలను సంక్షోభంలో పడేసింది. అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టులను ఆపేయడంతో పాలమూరు జిల్లా ఎండిపోయింది. రైతుల్లో ఎక్కువ శాతం ఇతర జిల్లాలకు, రాష్ర్టాలకు కూలీ పనుల కోసం వలసపోయారు. కృష్ణా నదీ జలాలు రాయలసీమకు ఎక్కువగా తరలించాలని వలస వంచకులు ఈ ప్రాజెక్టులను నిలిపివేశారు. దాంతో 2014 వరకు రోజూ రాత్రి పూటకు 3 బస్సుల నిండా ఆ జిల్లా వాసులు ఇతర రాష్ర్టాలకు వలసపోయారు. ఇది మూడు తరాల వారిని హింసపెట్టిన వలస పాలకుల 27వ తప్పు. 2014 తర్వాత తెలంగాణ పాలనలో మార్పు వచ్చింది. ఇప్పుడు వలస బస్సులు ఆగిపోయాయి.
28. తెలంగాణ నిధులతో నిర్మించిన కిన్నెరసాని ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలోని నిరుపేద ఆదివాసీలకు ఎప్పుడూ ఉపయోగపడలేదు. అక్కడి నుంచి ధవళేశ్వరం ఆయకట్టు కింది ఆంధ్రా ప్రాంత భూముల్లో రెండో పంట కోసం 60 ఏండ్లు ఉపయోగపడింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు వారి ప్రాంత నాయకుల ద్వారా బాగా లాభపడ్డారు. ఇది కాంగ్రెస్ 28వ తప్పు.
ప్రాజెక్టులు, ఉద్యోగాలలో వలస పాలకులు చేసిన లెక్కలేనన్ని మోసాల్లో కొన్నింటిని మాత్రమే చూశాం… ఇది వరకు వ్యాసాల్లో. మసిపూసి మా రేడు కాయ చేసి, నీళ్లు, నియామకాల విషయంలోనే అంత మోసం చేసిన వారికి మిగులు నిధు లు తరలించటం కష్టమా? ఆదాయం వారి చేతి లో, లెక్కలు వారి చేతిలో! ఫజల్ అలీ కమిషన్ నివేదికలో ముఖ్యంగా పేర్కొన్న విషయం మిగు లు నిధులు. ఎందుకంటే, విలీన ఆలోచనే మసిపూయడంగా కనిపించింది న్యాయమూర్తి ఫజల్ అలీకి. డబ్బు చాలక వాపిరిగొట్టు ముఖంవాడు అలమటిస్తుంటే, ఆ డబ్బు వాడి ముందు పెడితే అప్పనంగా కొట్టేయకుండా ఉంటాడా? అలా దొంగలకు తాళాలిచ్చినట్టయింది తెలంగాణలో.
-కనకదుర్గ దంటు