నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 9: శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం కోసం ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నేడు వాడవాడనా పెళ్లి వేడుక నిర్వహించేందుకు వేదికలు సిద్ధమయ్యాయి. హనుమకొండ రెవెన్యూ కాలనీలోని రామాలయం, మడికొండ మెట్టుగుట్ట, వేయిస్తంభాల గుడి, వరంగల్లోని శివనగర్ రామాలయం, గోవిందరాజుల గుట్ట, జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం జీడికల్ సీతారామచంద్ర, పాలకుర్తి మండలంలో దక్షిణ అయోధ్యగా గుర్తింపు పొందిన వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం, మానుకోటలోని రామాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానం, ములుగులోని శ్రీ క్షేత్రం, రామాలయాల్లో రాములోరి పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆదివారం మధ్యాహ్నం అభిజిత్ లగ్న సుముహూర్తానా సీతారామ కల్యాణ మహోత్సవాన్ని కనులపండువలా జరిపేందుకు వాడవాడలా ఏర్పాట్లు పూర్తాయ్యాయి. ఇంటింటినుంచి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వసతులు కల్పించారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని ప్రముఖ ఆలయాలు రాములోరి పెళ్లి వేడుకలకు ముస్తాబయ్యాయి. అంగరంగ వైభవంగా జరిగే వివాహ మహోత్సవం కోసం విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్నాయి. సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా వేడుకలు లేకపోవడం, ఇప్పుడు కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్నదానానికి ఏర్పాట్లు చేయడంతో పాటు ఎండాకాలం కావడంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, చల్లను అందుబాటులో ఉంచారు. ప్రధాన ఆలయాల ఆవరణలో భక్తుల కోసం చలువ పందిళ్లు, షామియానాలు, బారికేడ్లు వేశారు.